
స్కూల్ కంటే ర్యాలీ ముఖ్యమా? మోదీకి విద్యార్థి లేఖ..
ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి మోదీ అంకుల్ అంటూ ప్రధానికి లేఖ రాశాడు. మా చదువులు కంటే మీ మీటింగులు ముఖ్యమా అంటూ లేఖలో సూటిగా ప్రశ్నించాడు.
ఖాంద్వాః ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి మోదీ అంకుల్ అంటూ.. ప్రధానికి రాసిన లేఖతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మా స్కూల్ కంటే మీకు ర్యాలీ ముఖ్యమా అంటూ విద్యార్థిని ప్రశ్నించిన తీరుకు.. అసలేమైందంటూ ఆరా తీసింది. ప్రధాని సభకోసం విద్యార్థుల స్కూల్ బస్సులు తరలించడంపై ఆగ్రహం చెందిన విద్యార్థి తీరుకు యంత్రాంగం దిగొచ్చింది.
మధ్యప్రదేశ్ అలీరాజ్ పూర్ జిల్లా జోత్రాడా గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రశేఖర్ అజాద్ స్వగ్రామమైన భాబ్రాగ్రామంలో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం.. నిర్వహించే సభకు జిల్లా ప్రజలను తరలించేందుకు స్థానిక యంత్రాంగం స్కూలు బస్సులన్నింటినీ తరలించింది. అంతేకాదు స్కూళ్ళకు మంగళవారం, బుధవారం సెలవులను కూడా ప్రకటించారు. దీంతో స్థానిక విద్యా కుంజ్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవాంశ్ జైన్ ఆందోళన చెందాడు. ప్రధాని సభకోసం స్కూలుకు సెలవు ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు. పరిస్థితికి నివారణా మార్గం ఏమిటా అని ఆలోచించాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే లేఖ రాశాడు. మా చదువులు కంటే మీ మీటింగులు ముఖ్యమా అంటూ లేఖలో సూటిగా ప్రశ్నించాడు. మీరు అమెరికాలో ప్రసంగించినప్పడు కూడా భారీగా జనం తరలి వచ్చినట్లు చూశాను. కానీ వారంతా స్కూలు బస్సుల్లో అక్కడి వచ్చినట్లు మాత్రం చూడలేదు. మరి ఇండియాలో ఇలా ఎందుకు జరుగుతోంది? అని మోదీని ప్రశ్నించిన దేవాంశ్.. తనను తాను మోదీ అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. రేడియోలో వచ్చే 'మన్ కీ బాత్' ఎప్పుడూ మిస్ అవ్వకుండా వింటానని లేఖలో పేర్కొన్నాడు.
మీరు కాంగ్రెస్ నాయకుల్లా కాక మా చదువుల విషయంలో శ్రద్ధ తీసుకోండి అంటూ దేవాంశ్ లేఖలో వివరించాడు. అలాగే మా స్కూల్ బస్సులను తీసుకోవద్దని శివరాజ్ మామా (ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్) కు కూడా చెప్పండి అంటూ విన్నవించాడు. విద్యార్థి లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో జిల్లా కలెక్టర్ అప్రమత్తమై.. ప్రధాని బాభ్రా పర్యటనకోసం తీసుకున్న స్కూలు బస్సులను వెంటనే వెనక్కు ఇచ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనలో చట్ట వ్యతిరేక చర్యలు ఎదురుకాకుండా అసిస్టెంట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సునీల్ గౌడ్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.