నిర్భయ దోషులకు మరో వారంలో ఉరిశిక్ష

Mercy Petition Chance For Nirbhaya Rape Convicts - Sakshi

క్షమాభిక్షకు వారం గడువు ఇచ్చిన తిహార్‌ జైలు అధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలన్నీ పూర్తి అయ్యాయి. దీంతో మరికొన్ని రోజుల్లోనే వారికి మరణశిక్షను అమలుచేయనున్నారు. అయితే మరణశిక్ష విధించే ముందే దోషులకు క్షమాభిక్ష వేడుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తిహార్‌ జైలు అధికారులు నలుగురు దోషులకు నోటీసులు పంపారు. ‘నిర్భయ కేసులో దోషులకు (ముఖేష్‌, పవన్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ) న్యాయపరమైన కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. త్వరలోనే మరణ శిక్ష అమలు కానుంది. కానీ చివరగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం ఉంది. వారం రోజుల్లో మీరు ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అనంతరం తదుపరి వివరాలను కోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’ అంటూ నోటీసును పంపారు.

ఒకవేళ రాష్ట్రపతి వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తే.. మరణశిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. కాగా 2012 డిసెంబర్‌ 6 న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మెడిసిన్‌ విద్యార్థినిపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. మరోకరు మైనర్‌ అయినందున జువైనల్‌ కస్టడీలో ఉన్నారు. దీనిపై విచారణ అనంతరం ట్రయల్‌ కోర్టువారికి మరణశిక్షను విధించింది. దీనిని ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పమర్థించాయి. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ.. ముగ్గురు దోషులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో శిక్షను అమలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top