కశ్మీర్‌పై గవర్నర్‌ వివాదాస్పద ట్వీట్‌

Meghalaya Governor Tathagata Roy Says Boycott Everything Kashmiri - Sakshi

భగ్గుమన్న కశ్మీర్‌ నేతలు

సాక్షి, శ్రీనగర్‌ : రెండేళ్ల పాటు దేశ ప్రజలు ఎవరూ కశ్మీర్‌ వెళ్లొద్దని ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ చేసిన ట్వీట్‌ను సమర్ధించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్మీ అధికారి తన ట్వీట్‌లో ‘రెండేళ్ళ పాటు భారతీయులు ఎవరూ కశ్మీర్‌ వెళ్ళొద్దు.. అమర్‌నాథ్‌కు వెళ్ళొద్దు.. కశ్మీర్‌ ఎంపోరియం నుంచి కశ్మీరీ వర్తకుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయొద్దు’.  అని ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ రిటైర్డ్ అధికారిని సమర్థిస్తూ తథాగత రాయ్ ట్వీట్‌ చేశారు.

ఇక గవర్నర్‌ తీరుపై నెటిజన్లతో పాటూ కశ్మీరీ నేతలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉండి ఇలాంటి ట్వీట్‌లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరుల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తథాగత రాయ్‌పై మండిపడ్డారు. ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. తథాగత రాయ్‌‌ వంటి వ్యక్తులు కశ్మీరీలు లేని కశ్మీర్ కావాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top