‘వారిని ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగవిరుద్ధం’

లక్నో : యూపీ ప్రభుత్వం 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చుతూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. ఎస్సీ క్యాటగిరీలో ఏ ప్రభుత్వమైనా మార్పుచేర్పులను రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ నిరోధిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆ 17 ఓబీసీ వర్గాలు ప్రస్తుతం అటు ఓబీసీలు..ఇటు ఎస్సీలు కాకుండా పోయారని, వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని చెప్పారు.
రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆమె యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 341 ఆర్టికల్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టి రాజ్యాంగ ప్రక్రియకు అనుగుణంగా ఈ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆమె కోరారు. ఎస్సీ కోటాను సైతం అదే నిష్పత్తిలో పెంచాలని మాయావతి సూచించారు. గతంలో ఎస్పీ ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చిన సమయంలోనూ దాన్ని వ్యతిరేకించానని ఆమె గుర్తుచేశారు. కాగా యూపీ ప్రభుత్వం రాజ్‌భర్, మల్లా, ప్రజాపతి, కుమ్హర్ వంటి 17 ఓబీసీ కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి