
పనజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మధ్యాహ్నం స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గోవా చేరిన పరీకర్.. అక్కడ నుంచి అంబులెన్స్‌లో డోనా పౌలాలో ఉన్న నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు గోవా మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. పరీకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ విలేకరులకు తెలిపారు. గోవా అసెంబ్లీ రద్దు వార్తలను ఆయన ఖండించారు. ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురైన పరీకర్ గోవా, ముంబై, అమెరికాలో చికిత్స పొందారు. చివరికి సెప్టెంబర్ 15న ఎయిమ్స్‌లో చేరారు.