పుచ్చకాయ పత్రిక తీసుకోండి.. పెళ్లికి రండి! | Man Distributing Watermelon Wedding Cards For Marriage | Sakshi
Sakshi News home page

తీయని ఆహ్వానం

May 1 2019 2:15 PM | Updated on May 1 2019 2:15 PM

Man Distributing Watermelon Wedding Cards For Marriage - Sakshi

పుచ్చకాయపైన పెళ్లి పత్రికను అతికించిన దృశ్యం, ఆహ్వానం పలుకుతున్న చిత్రం

పెళ్లిపత్రిక అంటే వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో ఖరీదైనవి ముద్రించి...

 వెండి బంగారుతో నగిషీలు చెక్కి నవరత్నాలు పొదిగిన పెళ్లిపత్రికలను పంచే సంపన్నుల గురించి వార్తలొచ్చాయి. బంగారు నగలు, పట్టుచీరలు వంటి ఖరీదైన కానుకలతో కూడిన పెళ్లిపత్రికలను ఇచ్చినవారూ ఉన్నారు. పెళ్లిపత్రిక అంటే వారి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఎంతో ఖరీదైనవి ముద్రించి పంచడం చూస్తుంటాం. కానీ బళ్లారినగరవాసి పెళ్లి ఆహ్వానపత్రికను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.  

సాక్షి, బళ్లారి :   నగరంలోని ఎస్‌పీ సర్కిల్‌ సమీపంలో సాయిగోపాల్, వాణికుమారిల కుమారుడు సాయి సందీప్‌ ఎస్‌జీ కాలేజీలో బాటనీ హెచ్‌ఓడీగా పని చేస్తున్నారు. ఈయన పెళ్లి అదే కాలేజీలో వృక్షశాస్త్రం లెక్చరర్‌గా పని చేస్తున్న తేజస్వినితో కుదిరింది. పెళ్లి ఆహ్వాన పత్రికలను వినూత్న తరహాలో ముద్రించాలని భావించిన సాయి సందీప్‌ మండుటెండల్లో తీయగా ఉపశమనం కలిగించే పుచ్చకాయ మీద పెళ్లి పత్రికను ముద్రించి, బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు.     

వెయ్యి పుచ్చకాయ పత్రికల పంపిణీకి ఏర్పాట్లు  
ఇప్పటివరకు 400 వరకు పుచ్చకాయలను పంపిణీ చేశానని, మొత్తం వెయ్యి మందికి ఆహ్వానం పలకనున్నట్లు చెప్పారు.  ప్రతి రోజు ఉదయమే మార్కెట్‌లో 100కు పైగా పుచ్చకాయలను కొనుగోలు చేసి బంధుమిత్రులకు అందజేస్తున్నామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లిదండ్రులు కూడా తొలుత వ్యతిరేకత వ్యక్తం చేశారని, కొంత మందికి పెళ్లి ఆహ్వానాలు పలికిన తర్వాత పుచ్చకాయలపై పెళ్లి ఆహ్వానం పలకడంతో సంతోషించారని, దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.  

వృథా కాకూడదనే ఈ ప్రయత్నం  
సాయి సందీప్‌ సాక్షితో మాట్లాడుతూ మే 9న పెళ్లి సత్యనారాయణ పేటలోని రాఘవేంద్ర స్వామి కళ్యాణ మంటపంలో పెళ్లి ముహూర్తమని తెలిపారు.  ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేసి పంపిణీ చేసినా ఇలా చూసి అలా పడేస్తారని, దీంతో తాను అందించిన ఆహ్వాన పత్రిక వృథా కాకూడదని, గుర్తుండాలన్న సంకల్పంతో పాటు కళింగర కాయపై పెళ్లి వివరాలను రాసిన కాగితాన్ని అంటించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆహ్వాన పత్రికను చూసిన తర్వాత చల్లని పుచ్చకాయను ఆరగించాలన్నదే తన ఉద్దేశమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement