మధ్యప్రదేశ్‌, మిజోరంలో ముగిసిన పోలింగ్‌

Madhya Pradesh Mizoram Polling Updates - Sakshi

న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు పలు ప్రాంతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాలలో పోలింగ్‌ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 2,899 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 65 వేల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

మరోవైపు మిజోరంలోని 40 స్థానాలకు 209 మంది అభ్యర్థులు బరిలో నిలువగా ఈసీ 1,164 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 11న జరగనుంది.

మధ్యప్రదేశ్‌, మిజోరం పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌:

సాయంత్రం 5.45: మధ్యప్రదేశ్‌, మిజోరంలో ముగిసిన పోలింగ్‌: మధ్యప్రదేశ్‌లో సుమారు 65.5శాతం,  మిజోరంలో 73శాతం పోలింగ్‌ నమోదు

మధ్యాహ్నం 2.30: మధ్యప్రదేశ్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు 35.80 శాతం పోలింగ్‌ నమోదయింది. 

మధ్యాహ్నం 2.15: కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత  ఆయన హస్తం గుర్తు చూపించడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఎవరికి ఓటేశారని జర్నలిస్టులు అడిగితే చేతి గుర్తు చూపించానని ఆయన వివరణయిచ్చారు. కమలం గుర్తు చూపించమంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు.

మధ్యాహ్నం 1.45: పోలింగ్‌ కేంద్రాలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల మొరాయింపుపై ప్రధాన సీఈసీ  ఓపీ రావత్‌ స్పందించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్య తలెత్తినట్టు తెలిపారు. సమస్య తలెత్తిన ఈవీఎంలను, వీవీప్యాట్‌లను రీప్లేస్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఒకవేళ ఈవీఎం పనిచేయకపోవడం ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల నుంచి తిరిగి వెళ్లినట్టయితే.. ఆయా కేంద్రాల్లో రీపోలింగ్‌ గురించి ఆలోచిస్తామని తెలిపారు.

మధ్యాహ్నం 1.30: మధ్యాహ్నం ఒంటిగంటకు మధ్యప్రదేశ్‌లో 28.68 శాతం, మిజోరంలో 49 శాతం పోలింగ్‌ నమోదయింది.

మద్యాహ్నం 12.30: ఈవీఎంలలో లోపాలు తలెత్తినట్టు 100కు పైగా పోలింగ్‌ కేంద్రాల నుంచి ఫిర్యాదులు అందినట్టు మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి వీఎల్‌ కాంతారావు తెలిపారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించామని పేర్కొన్నారు. 

మద్యాహ్నం 12.00: పలు చోట్ల ఈవీఎంలు పనిచేయడం లేదని ఫిర్యాదుల వస్తున్న నేపథ్యంలో ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఈసీ ఓటింగ్‌ సమయాన్ని పెంచాలని జ్యోతిరాదిత్య సింధియా కోరారు.

ఉదయం 11.40: ఉదయం 11 గంటల వరకు మిజోరంలో 29 శాతం, మధ్యప్రదేశ్‌లో 21 శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఉదయం 11.30: మధ్యప్రదేశ్‌లోని గుణ, ఇండోర్‌లలో ఎన్నికలు విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కొల్పోయిన ముగ్గురు అధికారుల కుటుంబాలకు ఈసీ పరిహారం ప్రకటించింది.

ఉదయం 11.00: కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజల ఆశీస్సులతో డిసెంబర్‌ 11న కాంగ్రెస్‌ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఉదయం 10.00: ఉదయం 9 గంటల వరకు మిజోరంలో 15 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.32 శాతం పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఈవీఎంలలో సమస్య తలెత్తింది.

ఉదయం 9.30: మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన సొంత నియోజకవర్గం బుధ్నీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 100 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.

ఉదయం 9.15: మధ్యప్రదేశ్‌, మిజోరంలో తొలి సారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. మరోవైపు మిజోరం ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఉదయం 8.35: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు చింద్వారా హనుమాన్‌ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌ ప్రజలపై పూర్తి స్థాయి నమ్మకం ఉందన్నారు. చాలా కాలం నుంచి రాష్ట్రంలోని అమాయక ప్రజలను బీజేపీ మోసం చేస్తూ వస్తుందన్నారు.

ఉదయం 8.20: మిజోరంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు.

 

ఉదయం 8.00: మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 2 లక్షల మంది పోలీసులతో ఈసీ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా సీఎం పీఠంపై కన్నేసింది. మరోవైపు బీజేపీ వ్యతిరేకతను తమవైపు మలుచుకుని ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డింది.  

ఉదయం 7.50: రాష్ట్రవ్యాప్తంగా మరికొద్దిసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నర్మద తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని 3 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్‌ 7 గంటలకే ప్రారంభమైంది. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. మిగతా 227 నియోజకవర్గాల్లో 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. 

ఉదయం 7.00:  మిజోరంలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ స్టేషన్‌ల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 7.7 లక్షల మంది నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2008, 2013లలో మిజోరంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడ కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top