
కార్తీ చిదంబరంపై అట్టుడికిన పార్లమెంట్
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అవినీతి వ్యవహారంపై మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అవినీతి వ్యవహారంపై మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. కార్తీ చిదంబరంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే సభ్యులు ఉభయ సభలను స్తంభింపజేశారు. అన్నాడీఎంకే ఎంపీలు పదేపదే అడ్డు తగలడంతో పార్లమెంట్ మొదలైన గంటలోనే ఉభయ సభలు రెండుసార్లు వాయిదా పడ్డాయి.
ఎయిర్ సెల్-మాక్సిస్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని అన్నాడీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. దీనిపై తాత్సారం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. రియల్ ఎస్టేట్ లో ప్రపంచవ్యాప్తంగా కార్తీ చిదంబరం పెట్టుబడులు పెట్టారని ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ప్రతులను సభలో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన కాపీలకు బీజేపీ సభ్యులకు పంచిపెట్టారు.
సభ నియమ నిబంధనలకు అనుగుణంగా నోటీసు ఇస్తే చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకంచినా అన్నాడీఎంకే సభ్యులు శాంతించలేదు. తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.