రూ. 52 వేల మద్యం కొనేశారు..

Liquor Bill Worth Rs 52 thousand Goes Viral In Karnataka - Sakshi

బెంగళూరు : దాదాపు 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలకు అనుమతివ్వడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చాలా రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులు.. రెట్టించిన ఉత్సాహంతో అర్ధరాత్రి నుంచే వైన్‌ షాపుల ముందు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా.. షాపులు తెరిచే వరకు వేచి చూశారు. కొందరైతే షాపులు తెరవగానే.. భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా రూ. 52,841 విలువ చేసే మద్యం కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన బిల్లును ఫొటో తీసి వాట్సాప్‌లో ఉంచడంతో.. అది కాస్త వైరల్‌ మారింది.(చదవండి : మందుబాబులు ఎగబడ్డారు!)

దీంతో స్పందించిన కర్ణాటక ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మద్యం విక్రయించిన షాప్‌ ఓనర్‌పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అనుమతించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఓ వ్యక్తికి మద్యం అమ్మడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక్క రోజులో 2.6 లీటర్ల ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ లేదా 18 లీటర్ల బీర్‌ మాత్రమే ఒక వినియోగదారుడికి విక్రయించాలి. కానీ వాట్సాప్‌లో వైరల్‌ అయిన బిల్లు ప్రకారం.. దక్షిణ బెంగళూరులోని వనిల్లా స్పిరిట్‌ జోన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఓ వినియోగదారుడికి 13.5 లీటర్ల లిక్కర్‌, 35 లీటర్ల బీర్‌ విక్రయించింది. మరోవైపు ఆ బిల్లు పోస్ట్‌ చేసిన వ్యక్తిపై కూడా అధికారులు కేసు నమోదు చేయనున్నారు. అయితే అతడి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.(చదవండి : ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్‌ కరోనా ఫీజు)

ఇదే విషయంపై ఎక్సైజ్‌ అధికారులు సదరు మద్యం షాపు ఓనర్‌ను ప్రశ్నించగా.. వారు 8 మంది వినియోగదారులని, కానీ ఒక కార్డు ద్వారా బిల్లు మొత్తం చెల్లించినట్టు తెలిపాడు. అయితే ఓనర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా విచారణ సాగిస్తామని.. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇలా భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసిన కొందరు తమ బిల్లులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. అధికారులు వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు మంగళవారం నుంచి కర్ణాటకలో మద్యం రేట్లు 6 శాతం పెంచనున్నట్టు ఎక్సైజ్‌ శాఖ మంత్రి నాగేశ్‌ తెలిపారు. కాగా, మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన కేంద్రం.. పలు సడలింపులు ప్రకటించింది. అందులో భాగంగా కరోనా ప్రభావం అధికంగా లేని చోట్ల విక్రయాలకు అనుమతించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top