విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు ఐపీఎల్ స్కామ్‌స్టర్, పరారీలో ఉన్న నిందితుడైన లలిత్ మోదీ విదేశాల్లో తలదాచుకునేందుకు సహకరించడం కచ్చితంగా తప్పేనని బీజేపీ ఎంపీ ఆర్‌కే సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు.
లలిత్ మోదీ వ్యవహారంలో సుష్మ, రాజేలు తప్పు చేశారన్న బీజేపీ ఎంపీ ఆర్‌కే సింగ్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు ఐపీఎల్ స్కామ్‌స్టర్, పరారీలో ఉన్న నిందితుడైన లలిత్ మోదీ విదేశాల్లో తలదాచుకునేందుకు సహకరించడం కచ్చితంగా తప్పేనని బీజేపీ ఎంపీ ఆర్‌కే సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘అది చట్టపరంగా, నైతికంగా తప్పే. ఎవరైనా సరె.. పరారీలో ఉన్న నిందితుడ్ని కలవడం, అతడికి సహకరించడం కచ్చితంగా పొరపాటే’ అని ఈ హోంశాఖ మాజీ కార్యదర్శి తేల్చి చెప్పారు. లలిత్‌ను భారత్‌కు రప్పించి, చట్టం ముందు నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. లలిత్ విషయంలో సుష్మ, రాజేలు తప్పేం చేయలేదంటూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సమర్ధిస్తున్న సమయంలో ఆర్‌కే సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన కంపెనీకి లలిత్ మోదీ రుణం ఇవ్వడాన్ని తాను ‘సాధారణ వ్యాపారపరమైన లావాదేవీ’గానే అభివర్ణించడంపై దుమారం లేవడంతో స్టాన్‌ఫర్డ్‌లోలో ఉన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నష్టనివారణ ప్రారంభించారు. తానా మాట అనలేదని అన్నారు. లలిత్ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతున్న సంస్థలు.. ఆ లావాదేవీపైనా విచారణ జరుపుతాయని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ నియంత్రణలో ఉండే ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ పనితీరును ప్రభావితం చేసేలా జైట్లీ మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.