లాక్‌డౌన్‌ సడలింపు: కేరళ సీఎం కీలక నిర్ణయం

Kerala CM Says Will Implement Odd Even System For Vehicles Post April 20 - Sakshi

తిరువనంతపురం: కరోనా(కోవిడ్‌-19) మహమ్మారి భయం వెంటాడుతున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో బేసి- సరి విధానంలో వాహనాలను రోడ్ల మీదకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా కరోనా ప్రభావం ఉన్న జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించేందుకు కేంద్రం అనుమతిని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో గురువారం కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో.. కాసర్‌గడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలను ఒక జోన్‌గా పరిగణిస్తూ.. అక్కడ మే 3 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. (కొడుకు కోసం : 3 రోజుల్లో 6 రాష్ట్రాలు దాటి..)

ఇక రెండో జోన్‌లో పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలు ఉంటాయని.. అక్కడ హాట్‌స్పాట్‌ జోన్లను సీల్‌ చేయనున్నట్లు సీఎం విజయన్‌ పేర్కొన్నారు. అదే విధంగా అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్‌, త్రిసూర్‌, వయనాడ్‌ జిల్లాలను మూడో జోన్‌గా పరిగణిస్తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఆయా జిల్లాల్లో పాక్షికంగా సడలించనున్నట్లు తెలిపారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు కోవిడ్‌-19 కేసులు లేని జిల్లాలని.. అవి నాలుగో జోన్‌ కిందకు వస్తాయని పేర్కొన్నారు. కాగా కేరళ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో గురువారం నాటికి 394 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 147 ఆక్టివ్‌ కేసులు ఉండగా.. 245 మంది కోలుకున్నారు. ఇక మొత్తంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు.(తండ్రిని మోసిన కుమారుడు.. విచారణకు ఆదేశం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top