‘మేమెవర్నీ నమ్మలేం.. వాళ్ల గురించి తెలీదు’

Kamalesh Tiwari Son Wants Anti Terror Probe Over His Father Murder - Sakshi

హిందూ సమాజ్‌ నేత కమలేశ్‌ కుటుంబ సభ్యుల ఆవేదన

లక్నో : తన తండ్రిని హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని హిందూ సమాజ్‌ నేత కమలేశ్‌ తివారి కుమారుడు సత్యం తివారి డిమాండ్‌ చేశారు. భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ తన తండ్రి హత్య జరిగిందని.. ప్రస్తుతం తాము ఎవరినీ నమ్మే పరిస్థితుల్లో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ పార్టీ హిందూ సమాజ్‌ అధ్యక్షుడు కమలేష్‌ తివారీ (45) శనివారం దారుణ హత్యకు గురైన విషయం విదితమే. లక్నోలోని అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో సొంత నివాసంలో దుండగులు ఆయన గొంతు కోసి.. ఆపై పలుమార్లు కాల్పులకు తెగబడి అంతమొందించారు. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కమలేశ్‌కు ప్రాణహాని ఉందన్న వార్తల నేపథ్యంలో స్థానిక పోలీసులు ఇద్దరు సాయుధ పోలీసులను ఆయన నివాసం వద్ద కాపలా పెట్టారు. అయితే హత్య జరిగిన సమయంలో వారిద్దరు కమలేశ్‌ ఇంటి వద్ద లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్‌-ఉల్‌ -హక్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్‌ ముఫ్తీ నదీమ్‌ కాజ్మి, ఇమామ్‌ మౌలానా అన్వర్‌-‍ఉల్‌-హక్‌ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు.(చదవండి : హిందూ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు దారుణ హత్య)

ఈ ఘటన గురించి కమలేశ్‌ కుమారుడు సత్యం తివారి మీడియాతో మాట్లాడుతూ... ‘పోలీసులు అరెస్టు చేసిన వారు నిజమైన నిందితులో కాదో నాకు తెలియదు. ఒకవేళ అమాయకులను పట్టుకుని నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందా అన్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఆ ఐదుగురు నిజమైన నిందితులే అయితే.. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను పోలీసులు ఎన్‌ఐఏకు సమర్పించాలి. కేసు వారికి అప్పగించాలి. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారో లేదో అసలు అర్థంకావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు’ అని యోగి సర్కారుపై సందేహం వ్యక్తం చేశారు. ఇక కమలేశ్‌ హత్యకు సూరత్‌లో పథకం రచించినట్లుగా భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని... రషీద్‌ పఠాన్‌ అనే వ్యక్తి హత్యకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఘటనాస్థలంలో స్వీట్‌ బాక్స్‌ దొరికిందని... ఈ కేసును 24 గంటల్లో ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తన భర్తకు న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని కమలేశ్‌ భార్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెంటనే తమను కలిసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top