హిందూ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు హత్య

Hindu Samaj Leader Kamlesh Tiwari Murdered - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అంతగా గుర్తింపు లేని రాజకీయ పార్టీ హిందూ సమాజ్‌ అధ్యక్షుడు కమలేష్‌ తివారీ (45) దారుణ హత్యకు గురయ్యారు. లక్నోలో అత్యంత రద్దీగా ఉండే నాకా హిందోలా ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో శవమై కనిపించారు. లక్నో పశ్చిమ ఏఎస్పీ వికాస్‌ త్రిపాఠీ అందించిన వివరాల ప్రకారం కమలేష్‌ తివారీని ఆయన ఇంట్లోనే అతి దారుణంగా హత్య చేశారు. హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఆయనను కలవడానికి వచ్చారు. వారితో మాట్లాడుతున్న తివారీ పాన్‌ల కోసం తన అనుచరుడ్ని బయటకి పంపించారు. మార్కెట్‌ నుంచి అతను తిరిగి వచ్చేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. రక్తపు మడుగులో తివారీ శవమై కనిపించారు. తివారీని కలవడానికి వచ్చినవారు ఆ ఇంట్లో అరగంట కంటే ఎక్కువ సేపు గడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. హంతకుల్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. హిందూ మహాసభతో విభేదాల కారణంగా బయటకు వచ్చిన తివారీ హిందూ సమాజ్‌ పార్టీని స్థాపించారు. తివారీ హత్య కేసులో ఐదుగురి హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముస్లిం మత గురువు అన్వర్‌-ఉల్‌ -హక్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

తివారీ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసేందుకు మహ్మద్‌ ముఫ్తీ నదీమ్‌ కాజ్మి, ఇమామ్‌ మౌలానా అన్వర్‌-‍ఉల్‌-హక్‌ కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త తలకు రూ.1.5 కోట్లు వెల కట్టారని ఆరోపించారు. కమలేష్‌ తివారీ హత్యకు సూరత్‌లో కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముగ్గురిని సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి గుజరాత్‌ ఏటీఎస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సూరత్‌ నుంచి అహ్మదాబాద్‌కు తీసుకొచ్చారు. కాగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వచ్చి నివాళి అర్పించే వరకు తివారీ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. తివారీ హత్య నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్నోతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను యూపీ పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top