ఉగ్రవాదులకు పోలీసు సాయం..

Jammu Kashmir Police arrests deputy SP Davinder Singh along with 2 terrorists - Sakshi

ఇద్దరు టెర్రరిస్టులను తరలిస్తున్న సీనియర్‌ పోలీస్‌

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు

శ్రీనగర్‌: ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ దావిందర్‌ సింగ్‌ శనివారం ఇద్దరు ఉగ్రవాదులను కారులో తీసుకెళుతూ పట్టుబడ్డాడని కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీపీ) విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. డీఎస్పీ స్థాయిలో ఉండి, ఉగ్రవాదులకు సహాయం చేయడం హీనమైన చర్య అని పేర్కొన్నారు. వీరిలోని మరో ఉగ్రవాది నవీద్‌ కూడా కానిస్టేబుల్‌గా పనిచేశాడు. 2017లో పోలీసు వృత్తిని వదలి హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. పలువురు పోలీసులను, పౌరులను చంపినట్లు ఇతడిపై 17 కేసులున్నాయని తెలిపారు. పార్లమెంటు దాడి కేసులో వీరి ప్రమేయం ఉందన్న ఆరోపణలను ఐజీపీ కొట్టిపారేశారు. దీనిపై తమకు ఏ సమాచారం లేదని, అయినప్పటికీ ఈ విషయం గురించి వారిని విచారిస్తామని చెప్పారు.  

దొరికారిలా..
శ్రీనగర్‌ నుంచి జమ్మూ వైపు ఇద్దరు ఉగ్రవాదులు  ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారని సోపియన్‌ ఎస్పీకి ఇంటెలిజెన్స్‌ సమాచారం ఇచ్చింది. ఆ ఎస్పీ ఐజీపీకి, ఐజీపీ డీఐజీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాపు కాసి వారి కారును ఆపి తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం విచారణ కోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఆర్‌ఏడబ్ల్యూ, సీఐడీ వంటి ఇంటెలిజెన్స్‌ వర్గాలన్నింటికీ సమాచారం ఇచ్చామని ఐజీపీ చెప్పారు. ఉగ్రవాదులను తరలిస్తున్న డీఎస్పీ దావిందర్‌ సింగ్‌ను కూడా ఉగ్రవాదిగానే పరిగణించి విచారిస్తున్నామని చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున అంతకు మించి వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. ఒక పోలీస్‌ ఉగ్రవాదులకు సాయపడినంత మాత్రాన కశ్మీర్‌ పోలీసులంతా అంతేననే ఆలోచన సరికాదని చెప్పారు.  

కీలక మిలిటెంట్లు హతం..
జమ్మూకశ్మీర్‌లోని ట్రాల్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. వీరంతా హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ మిలిటెంట్లని చెప్పారు. మృతులను ఉమర్‌ ఫయాజ్‌ లోనె , ఫైజాన్‌ హమిద్, అదిల్‌ బాషిర్‌ మిర్‌ అలియాస్‌ అబు దుజనగా గుర్తించారు. ఇందులో ఫయాజ్‌ లోనెపై 16 కేసులు ఉన్నట్లు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top