
నేడు సి.ఆర్.పి.ఎఫ్.డే
2001 డిసెంబర్ 13న దేశం ఉలిక్కిపడింది. కారణం? పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. రక్షణగా ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ దళాలు ఉగ్రవాదులతో పోరాడాయి. ఆ సి.ఆర్.పి.ఎఫ్‌లోనే కమలేష్ కుమారి అనే ఆడపులి కూడా ఉంది. ఆమె ఉగ్రవాదులను అడ్డుకుంటూ దేశం కోసం తన ప్రాణాలు బలి ఇచ్చింది. మరణానంతరం అశోకచక్రను పొందిన కమలేష్‌ను స్మరించుకుందాం.
దేశంలో అంతర్గత భద్రతకు 85 ఏళ్ల క్రితం జూలై 27, 1939లో ‘క్రౌన్ రిప్రెజెంటేటివ్స్ పోలీస్’గా ఏర్పడి ఆ తర్వాత 1949 నుంచి ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’గా సేవలు అందిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్‌లో ఇప్పటి వరకూ ఒకే ఒక మహిళ ‘అశోక చక్ర’ పొందింది. ఆమె కమలేష్ కుమారి. దేశం కోసం సి.ఆర్.పి.ఎఫ్ నుంచి ఎందరో ప్రాణత్యాగం ఇచ్చినా వారిలో కమలేష్ కుమారిది మాత్రం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే పేరే. అందుకంటే పార్లమెంట్ మీద అటాక్ అయిన సందర్భంలో ఆమె తన ప్రాణాలు అర్పించి మొత్తం హౌస్‌నే కా పాడటంలో కీలక పాత్ర పోషించింది.
ఉత్తర ప్రదేశ్ మహిళ
కమలేష్ కుమారిది ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్. సి.ఆర్.పి.ఎఫ్‌లో 1994లో చేరి కొంతకాలం ‘104 రాపిడ్ యాక్షన్ ఫోర్స్’లో అలహాబాద్‌లో పని చేసింది. ఆ తర్వాత ‘88 విమెన్స్ బెటాలియన్’లోకి మారింది. 2001 జూలై నుంచి ఆమె ఢిల్లీలో విధులు నిర్వహిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు విమెన్స్ బెటాలియన్ సభ్యులు సెక్యూరిటీ విధులు నిర్వర్తించడం ఆనవాయితీ. ఆ విధంగా డిసెంబర్ 13న ఆమెకు పార్లమెంట్ డ్యూటీ పడింది. ఆ రోజునే పార్లమెంట్ మీద ఉగ్రదాడి జరిగింది. అప్పటికి కమలేష్ కుమారికి వివాహమై ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి వయసు 9 ఏళ్లు, రెండో అమ్మాయి వయసు ఒకటిన్నర సంవత్సరాలు.
ఆ రోజున
డిసెంబర్ 13, 2001న ఉదయం 11.40 గంటలకు ఒక తెల్ల అంబాసిడర్ కారు పార్లమెంట్ భవనంలోకి దూసుకు వచ్చింది. ఆ సమయాన లోపల అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులతో పాటు 200 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ సమయానికి కమలేష్ కుమారి గేట్ నంబర్ 11 వద్ద ఐరన్ గేట్ 1 దగ్గర విధులు నిర్వహిస్తోంది. ఆ రోజుల్లో మహిళా సి.ఆర్.పి.ఎఫ్ సభ్యులకు ఆయుధాలు ఇచ్చే ఆనవాయితీ లేదు. ఆమె వద్ద కేవలం వాకీటాకీ ఉంది.
కారు దూసుకురావడంతో మొదట అందరూ అది కాన్వాయ్ కారు అనుకున్నారు. కాని కమలేష్ కుమారి అది అనుమతి లేని కారు అని గ్రహించి పక్కనే ఉన్న మరో గార్డ్‌ను అలెర్ట్ చేసి పెద్దగా అరిచి కారు వెనుక పరిగెత్తింది. అప్పటికే అందులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులు కారులో నుంచి జంప్ చేసి కారును పేల్చేయాలని పథకం పన్నారు. కాని కమలేష్ కుమారి పరిగెత్తుకుని రావడంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న లాన్‌లోకి దూసుకు పోయింది. కారు పేల్చే ప్లాన్ కుదరక అందులో ఉన్న ఐదుగురు దిగి కాల్పులు మొదలెట్టారు.
అప్పటికే వాకీటాకీ ద్వారా అందరినీ అప్రమత్తం చేసిన కమలేష్ కుమారి ఒక నిందితుడు పేలుడు పదార్థాలతో పార్లమెంట్ వైపు దూసుకు వెళ్లడాన్ని చూసి వాకీటాకీ ద్వారా దళాన్ని హెచ్చరించింది. ఇంకొన్ని సెకన్లలో అతడు లోపలికి వెళతాడనగా డోర్లు మూసేయగలిగారు. గేటు వైపు నుంచి ఒకరు, లాన్ వైపు నుంచి మరొకరు ఆ ఉగ్రవాదిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. లేకుంటే అతడు లోపలికి వెళ్లి మొత్తం సభ్యులను ఏం చేసేవాడో ఊహించడమే కష్టం. అయితే తమ రాకను అలెర్ట్ చేసి అంతా ఛిన్నాభిన్నం చేసిన కమలేష్ కుమారిని ఉగ్రవాదులు వదల్లేదు. బుల్లెట్లు కురిపించారు. మొత్తం 11 బుల్లెట్లు ఆమె శరీరంలో దూసుకు పోయాయి. ఆమె ప్రాణాలు పోయినా దేశ గౌరవాన్ని కా పాడగలిగింది.
అశోక చక్ర
పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 9 మంది అమరులయ్యారు. వీరిలో కమలేష్ కుమారి ఒక్కరే మహిళ. 2002లో ఆమెకు మరణానంతర ‘అశోక చక్ర’ ప్రకటించారు. నాటి ప్రధాని ఆమెకు అంజలి ఘటించారు. అశోకచక్ర అందుకున్న ఏకైక మహిళగా నిలిచింది కమలేష్ కుమారి.