భారత్‌లో దాడులకు జైషే, ఐఎస్‌ల భారీ కుట్ర

Jaishe Islamic State Terrorists Planning Fidayeen Attacks In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జైషే మహ్మద్‌, ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా తాజా దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి. ఆప్ఘనిస్తాన్‌లో జైషే, ఐఎస్‌ సభ్యుల మధ్య ఐఎస్‌ఐ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులను ఐఎస్‌ఐ ప్రోత్సహిస్తోందని ఈ నివేదికలో నిఘా సంస్ధలు పేర్కొన్నాయి.

కాగా జైషే మహ్మద్‌, తాలిబాన్‌ టెర్రరిస్టులు దీర్ఘకాలంగా ఆప్ఘనిస్తాన్‌లో నాటో సైనిక దళాలతో తలపడుతున్నారని, తాము ఈ పరిణామాలను చాలాకాలంగా గమనిస్తున్నామని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఐఎస్‌, జైషే మహ్మద్‌ ఉగ్రవాదులను కలపడం ద్వారా భారత్‌లో భారీ కుట్రకు ఐఎస్‌ఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. మరోవైపు బాలాకోట్‌ వైమానిక దాడులతో భంగపడ్డ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ మరోసారి చురుకుగా మారినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

భారత్‌లో మెరుపు దాడులు చేపట్టేందుకు సుశిక్షితులైన ఉగ్రవాదులనే ఎంచుకోవాలని అజర్‌ జైషే టాప్‌ కమాండర్లకు సూచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. జైషే టాప్‌ కమాండర్లతో భేటీ సందర్భంగా భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్టు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top