ఫాసిస్టు చట్టంపై స్పందించండి: టెకీల బహిరంగ లేఖ

Indian techies pen open letter again citizenship bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఏఏ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) తీవ్ర ఆందోళన రోజురోజుకు రాజుకుంటున్న తరుణంలో భారతీయ ఐటీ నిపుణులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం  ఫాసిస్ట్‌ చట్టంగా పేర్కొంటూ  బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు  దీనిపై స్పందించాల్సిందిగా వ్యాపారవేత్తలు ముకేశ్‌ అంబానీ,  టెక్‌ దిగ్గజాలు గూగుల్, ఉబెర్, అమెజాన్, ఫేస్‌బుక్ అధిపతులకు విజ్ఞప్తి చేశారు. 'టెక్అగైన్‌స్ట్ ఫాసిజం' అనే పేరుతో ప్రచురించిన లేఖలో ఫాసిస్ట్ భారత ప్రభుత్వ చర్యల్ని టెకీలుగా తీవ్రంగా నిరసించారు. పౌరులపై క్రూరత్వాన్ని ఆపాలని, ఇష్టానుసారం ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సాంకేతిక పరిజ్ఞానం మంచి కోసం ఉపయోగించాలి తప్ప, ప్రభుత్వం అణచివేతకు వినియోగించడాన్నినిరాకరించాలని కోరారు. సీఏఏ 2019, ఎన్‌ఆర్‌సీ ముస్లింలకు వ్యతిరేకమైన పథకాలనీ, ప్రపంచవ్యాప్తంగా వారి పట్ల మరింత అసమానతలకు దారితీస్తుందని లేఖలో పేర్కొన్నారు.  

భారత ప్రభుత్వ తన అసమర్థతను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందనీ, భారతదేశ ఆర్థిక క్షీణత, రికార్డు స్థాయిలో నిరుద్యోగం, వృద్ధి మందగమనం, తీవ్రమైన రైతు ఆత్మహత్యల తోపాటు దేశంలోని అతిపెద్ద సామాజిక-ఆర్థిక సంక్షోభాలపై "అల్ట్రా-నేషనలిస్ట్,డైవర్షనరీ వ్యూహాలను ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు. పౌరులు,ఆందోళనకారులపై ప్రభుత్వ అణచివేతను,  దమనకాండను  తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే భారత ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలను బహిరంగంగా ఖండించాలని సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్‌బుక్), జాక్ డోర్సే (ట్విటర్), దారా ఖోస్రోషాహి (ఉబెర్), ముకేశ్‌ అంబానీ (జియో), గోపాల్ విట్టల్ (భారతి ఎయిర్‌టెల్), కళ్యాణ్ కృష్ణమూర్తి (ఫ్లిప్‌కార్ట్),శాంతను నారాయణ్ (అడోబ్)కు విజ్ఞప్తి చేశారు.

ఒకవైపు డిజిటల్ ఇండియా అంటూ గొప్పగా ప్రచారం చేస్తూ, మరోవైపు తిరోగమన ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పౌరులకు దూరం చేస్తూ వారిని అణచివేయడానికి ఒక రాజకీయ సాధనంగా చూస్తోందనీ, అన్ని నెట్‌వర్క్‌లను నకిలీ వార్తల వ్యాప్తికి ఉపయోగించుకుంటోందని విమర్శించారు. శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్, లండన్, ఇజ్రాయెల్, బెంగళూరులలో పనిచేస్తున్న దాదాపు 150 మంది టెక్‌ ఉద్యోగులు ( సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, పరిశోధకులు, ఎనలిస్టులు, డిజైనర్లు )ఈ లేఖపై సంతకాలు  చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top