
లద్దాఖ్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించారు. భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటన చేపట్టారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కూడా ఉన్నారు. రాజ్‌నాథ్ పర్యటన సందర్భంగా భారతీయ పారాట్రూపర్లు లద్దాఖ్‌లోని గగనతలంలో సైనిక విన్యాసాలు చేశారు. ఆక్సిజన్ మాస్కులు ధరించిన పారాట్రూపర్లు అమెరికన్ సీ130జే సూపర్ హెర్క్యులస్ విమానంలో నుంచి ఒకరి వెంట మరొకరు దూకుతూ శక్తిసామర్థ్యాలను చాటుకున్నారు. (‘ఏ శక్తి అంగుళం భూమిని కూడా తీసుకోలేదు’)
వీటిని వీక్షించిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. "భారత్ ప్రపంచానికి శాంతి సందేశాన్నిచ్చే ఏకైక దేశం భారత్. మేము ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు. ఏ దేశం భూమి కూడా మాదేనని గొడవకు దిగలేదు. వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే విషయాన్ని భారత్ ఎప్పుడూ విశ్వసిస్తుంది" అని పేర్కొన్నారు. కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్‌లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్ లోయలో నెలకొన్న పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. (లద్దాఖ్‌లో పర్యటిస్తున్న రక్షణశాఖ మంత్రి)