అప్పుడే కబడ్డీ ఆడుంటే..

If we attack at that time Pak has been checked for terrorism - Sakshi

పాక్‌కు ఉగ్రవాదానికి చెక్‌పడేది

ఎల్వోసీపై పట్టుకు పక్కా ప్రణాళిక

9/11 ఘటనతో నిరవధిక వాయిదా

జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత ఆర్మీ రూపొందించిన పథకం పేరే ఆపరేషన్‌ కబడ్డీ. అయితే..2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌పై ఉగ్రదాడితో ఈ పథకం అమలుకు నోచుకోలేదని జేఎన్‌యూ అధ్యాపకుడు హ్యాపీమన్‌ జాకబ్‌ ‘లైన్‌ ఆన్‌ ఫైర్‌’అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఆపరేషన్‌ కబడ్డీ పేరుతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టి ఉంటే 1972 భారత–పాక్‌ యుద్ధం తర్వాత ఉనికిలోకి వచ్చిన నియంత్రణరేఖ స్వరూపం మారిపోయేది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రస్థావరాలుండేవి కావు. ఉగ్రదాడులకు తెరపడి ఉండేది. 

బటాలిక్‌ సెక్టార్‌ నుంచి..
కశ్మీర్‌ లద్దాఖ్‌ ప్రాంతంలో బటాలిక్‌ సెక్టార్‌లోని దాదాపు 25–30 పాక్‌ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి భారత ఆర్మీ ఉత్తర కమాండ్‌ పథకం రూపొందించింది. మెరుపుదాడులతో మొదలై అనేక దశల్లో పాక్‌ దళాలను దాటి ముందుకు సాగుతూనే... పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా చూడడం ఈ ఆపరేషన్‌ ఉద్దేశం. 2001 జూన్‌లో న్యూఢిల్లీలోని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ సుందరరాజన్‌ పద్మనాభన్‌ కార్యాలయంలో.. ఆర్మీ ఉత్తర కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ రుస్తుం కే నానావతీ, సైనిక ఆపరేషన్ల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎంఓ), లెఫ్టినెంట్‌ జనరల్‌ గురుబ„Š సింగ్‌ సమావేశమై.. ఈ మెరుపుదాడి ముసాయిదా రూపొందించారు. ఒక్కో భారత బ్రిగేడ్‌ కనీసం.. ఒకట్రెండు పాక్‌ పోస్టులు స్వాధీనం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక విజయవంతంగా అమలుచేస్తే పాక్‌ సరిహద్దుల్లో నెలకొన్న వాతావరణాన్ని పూర్తిగా మార్చవచ్చని జనరల్‌ నానావతీ తన ఆలోచన పంచుకున్నారు. అనంతరం.. ఆపరేషన్‌ కబడ్డీకి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడానికి జనరల్‌ పద్మనాభన్‌ అనుమతి ఇచ్చారు.

3 నెలల్లో ఏర్పాట్లు పూర్తి
ఉధంపూర్‌లోని తన ప్రధాన కార్యాలయానికి చేరుకున్న జనరల్‌ నానావతీ.. ఆర్మీ చీఫ్‌కు చెప్పినట్టే ఈ ఆపరేషన్‌కు మూడు నెలల్లో అంతా సిద్ధం చేశారు. ఏర్పాట్లు పూర్తయ్యాక ఏ రోజైనా దాడులు ప్రారంభించడానికి ఆదేశాలిస్తామని పద్మనాభన్‌ చెప్పారు. అణ్వాయుధాలున్న రెండు దేశాల మధ్య ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా చూడడానికి దాడులను బ్రిగేడ్, ఇంకా కింద స్థాయిలోనే నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అధీనరేఖ అవతలి పాక్‌ భూభాగంలోని సైనిక, ఉగ్రవాద శిబిరాలను, ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుని మెరుపుదాడులు జరపడం ‘ఆపరేషన్‌ కబడ్డీ’లక్ష్యం. ఇది విజయవంతంగా అమలు చేస్తే అధీనరేఖపై భారత సేనకు పూర్తి పట్టుతోపాటు సీమాంతర ఉగ్రవాదుల నిర్మూలనకు మంచి అవకాశం లభించేది. ఈ మెరుపు దాడుల అనంతరం.. పాక్‌ స్పందనకు ఎలా జవాబివ్వాలో కూడా పథకాలు సిద్ధం చేశారు. ఆర్మీ ఒక్కటే ఈ పని పూర్తి చేయాలని, భారత వైమానికదళానికి విషయం చెప్పడం గానీ, దాని సాయం తీసుకోవడంగాని జరగకూడదని మొదట అనుకున్నారు. కానీ, దాడులు పకడ్బందీగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో వాయుసేనను కూడా దింపాలని  జనరల్‌ సిహోటాకు నానావతీ సూచించారు. 1990ల్లో కశ్మీర్‌లో పాక్‌ మద్దతుతో సాగిన ఉగ్రవాదంపై అనేక సైనిక విజయాలతో ఉగ్రదాడులు కొంతమేర తగ్గుముఖం పట్టినా 2000 తర్వాత పాక్‌ వైపు నుంచి చొరబాట్లు పెరిగాయి. ఆపరేషన్‌ కబడ్డీకి ఇదో ప్రధాన కారణం.

సెప్టెంబర్‌ 1 2001 అంతా సిద్ధం
‘ఆపరేషన్‌ కబడ్డీ’ప్రణాళికను సెప్టెంబర్‌ ఒకటిన గానీ.. తర్వాత గానీ అమలు చేయాలనుకున్నారు. అయితే, పని ప్రారంభించడానికి, ముగించడానికి తేదీలు నిర్ణయించలేదు. ఈ సైనిక పథకానికి వాజ్‌పేయి నేతృత్వంలోని నాటి కేంద్ర సర్కారు నుంచి అనుమతిపై స్పష్టత లేదు. రక్షణ మంత్రులుగా పనిచేసిన జార్జి ఫెర్నాండెజ్, జశ్వంత్‌సింగ్‌ల అనుమతి పొందిన విషయాన్ని కూడా ఉన్నత సైనికాధికారులు ధ్రువీకరించలేదు. సెప్టెంబర్‌ మొదట్లో జనరల్‌ నానావతీకి ఢిల్లీ డీజీఎంఓ నుంచి జనరల్‌ సిహోటా ఫోన్‌చేసి.. ‘మీరు సిద్ధమేనా? మీ పథకాలు రెడీయేనా?’అని అడిగారు. తాము సెప్టెంబర్‌ ఒకటి నుంచి సిద్ధంగా ఉన్నామని నానావతీ జవాబిచ్చారు. సైనిక సిబ్బంది మెరుపు దాడులకు తయారుగా ఉందనీ, ఆర్మీ చీఫ్‌ నుంచి ఆదేశాలు రావడమే తరువాయని ఆయన తెలిపారు. ఈ సమయంలో సెప్టెంబర్‌ 9న న్యూయార్క్‌లోని డబ్ల్యూటీవో టవర్స్‌.. ఉగ్రవాదుల వైమానిక దాడులతో కూలిపోయాయి. ఫలితంగా ఉగ్రవాదంపై జరిపే పోరులో అమెరికాకు పాకిస్తాన్‌ కీలక భాగస్వామిగా మారింది. న్యూయర్క్‌పై దాడి జరిగిన వెంటనే ఆపరేషన్‌ కబడ్డీని అమలు చేసినా బావుండేది. కానీ, కొన్ని రోజులు గడిచాక ఒసామాబిన్‌ లాడెన్‌ను పట్టుకునే ప్రయత్నంలో పాక్‌కు అమెరికా ప్రాధాన్యం ఇవ్వడంతో అధీనరేఖ మీదుగా భారత ఆర్మీ దాడులకు అవకాశం లేకుండాపోయింది. గొప్ప అవకాశం భారత్‌ చేజారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top