ఆన్‌లైన్ షాపింగ్.. ఐఏఎస్ భార్యకు నోటీసులు
ఆన్‌లైన్‌లో అతిగా షాపింగ్ చేసిన ఓ ఐఏఎస్ అధికారి భార్యకు మధ్యప్రదేశ్ ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు.
భోపాల్: ఆన్‌లైన్‌లో అతిగా షాపింగ్ చేసిన ఓ ఐఏఎస్ అధికారి భార్యకు మధ్యప్రదేశ్ ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు పంపారు. స్వల్ప వ్యవధిలోనే సుమారు రూ. 10 లక్షల విలువచేసే అన్‌లైన్ షాపింగ్ చేసినందుకుగాను ఆమె నోటీసులు అందుకున్నారు. ఐఏఎస్ అధికారి సన్నిహితులు మాత్రం 'ఆమె కంపల్సీవ్ బయ్యింగ్ డిసార్డర్‌తో బాధపడుతున్నారని, ఇలాంటి డిసార్డర్ ఉన్నవారు షాపింగ్ విషయంలో తమను తాము నియంత్రించుకోకుండా ఇలాగే ప్రవర్తిస్తుంటారు' అని చెబుతున్నారు.
కొనుగోలుదారుల ఆన్‌లైన్ షాపింగ్ వివరాలు ఎప్పటికప్పుడు అందేలా ఆదాయపన్ను శాఖవారు ఓ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిద్వారా ఆమె జరిపిన ఆన్‌లైన్ షాపింగ్ వివరాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయపన్నును విడిగా దాఖలు చేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి భార్య ఇప్పటివరకు నోటీసులపై స్పందింలేదని తెలిపారు.