కొబ్బరి చెట్టు...చెట్టుకాదా? | Goa rules that a coconut tree isn't really a tree – and a liquor firm reaps the benefits | Sakshi
Sakshi News home page

కొబ్బరి చెట్టు...చెట్టుకాదా?

Dec 31 2015 4:52 PM | Updated on Sep 3 2017 2:53 PM

కొబ్బరి చెట్టు...చెట్టుకాదా?

కొబ్బరి చెట్టు...చెట్టుకాదా?

గోవా అనగానే మనకు గుర్తు వచ్చేది అందమైన బీచ్‌లతోపాటు ఎక్కడికెళ్లినా కనిపించే పచ్చని కొబ్బరి చెట్లు.

పణాజి: గోవా అనగానే మనకు గుర్తు వచ్చేది అందమైన బీచ్‌లతోపాటు ఎక్కడికెళ్లినా కనిపించే పచ్చని కొబ్బరి చెట్లు. ఇప్పుడు వాటి మనుగడకే ముప్పు తీసుకొచ్చే నిర్ణయం గోవా కేబినెట్ తీసుకున్నది. గోవాలో ప్రభుత్వ స్థలమే కాకుండా ప్రైవేటు స్థలంలో ఉన్న ఏ చెట్టును కొట్టివేయాలన్ని గోవా, డయ్యూ, డామన్ చెట్ల పరిరక్షణ చట్టం కింద అటవి శాఖా అధికారుల అనుమతి తీసుకోవాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చెట్ల జాబితా నుంచే కొబ్బరి చెట్టును తొలగించింది. దీని వల్ల ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అటవి శాఖా అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే రాష్ట్రంలోని కొబ్బరి చెట్లను కొట్టివేయవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం పట్ల పర్యావరణ పరిరక్షకులు,  నిపుణులు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కొబ్బరి చెట్టు చెట్టుకాకపోతే, మరి గడ్డియా?’ అని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు క్లాడ్ ఆల్వరెస్ ప్రశ్నిస్తున్నారు. కొబ్బరి కాయల వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కొబ్బరి నీళ్లు మానవ ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషక విలువలను ఇస్తుండగా, దాని నూనెను రాష్ట్ర వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఫెన్నీ లాంటి మద్యంలో కూడా వినియోగిస్తున్నారని చెప్పారు. అలాగే ఎండిన కొబ్బరి పీచులను వంట చెరకుగాను, పరుపుల్లోను ఉపయోగిస్తున్నారని తెలిపారు.

ఇప్పుడు చెట్టు జాబితా నుంచి దాన్ని తొలగించడం వల్ల రానున్న కాలంలో ఈ చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఎంతో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  1984 నాటి చెట్ల పరిరక్షణ చట్టంలో కొబ్బరి చెట్టు లేదని, 2008లో మాత్రమే చట్టంలో ఆ చెట్టును చేర్చారని, చెట్టు అనే నిర్వచనం కిందకు అది రాదుకనుక దాన్ని తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. చెట్టంటే దానికి శాఖలు ఉండాలని, నిర్దేశించిన ప్రమాణాల్లో దాని మొదలు ఉండాలని ప్రభుత్వం వాదిస్తోంది. చట్టంలో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఓ చెట్టు మొదలు ఐదు సెంటీమీటర్ల వ్యాసంతోపాటు 30 సెంటీ మీటర్ల పొడవుండాలి. ఇప్పుడు కేబినెట్ ఈ నిర్వచనాన్ని కూడా మార్చివేసింది. పది సెంటీమీటర్ల వ్యాసం, ఒక మీటరు పొడవు ఉండాలంటూ కొత్త  నిర్వచనాన్ని తీసుకొచ్చింది.

మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నదన్న అనుమానం రావచ్చు. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని సంగియం తాలూకాలో ఓ డిస్టిలరీని ఏర్పాటు చేసేందుకు ‘వాణి ఆగ్రో’ అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ స్థలంలో దాదాపు 500 కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటిని కొట్టివేసేందుకు చట్టం అడ్డుపడుతోంది. సవరించని పాత చట్టం ప్రకారం ప్రభుత్వ స్థలంలో చెట్లు ఉంటే వాటిని అటవి శాఖ అధికారులు అసలు కొట్టనీయరు. ప్రైవేటు స్థలంలో చెట్లను కొట్టివేయాలంటే యజమాని అవసరం మేరకు అనుమతి ఇస్తారు. కొట్టివేసిన ప్రతి చెట్టుకు యజమాని నుంచి నష్ట పరిహారాన్ని కూడా వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement