ఆత్మపరిశీలన అవసరం ఎవరిది?

Sakshi Editorial On Insensitive Comments By Goa CM

మాట పొదుపుగా వాడాలి! చేత అదుపులో ఉండాలి!! అధికారంలో ఉన్నవాళ్ళకు అన్ని రకాలుగా వర్తించే మహావాక్యాలివి. గద్దె మీద ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిందే! లేదంటే తర్వాతి పర్యవసానాలకు వారు తమను తాము తప్ప, వేరెవరినీ నిందించలేరు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌కు ఆ సంగతి ఇప్పుడు తెలిసొచ్చి ఉండాలి. వారం క్రితం జూలై ఆఖరు ఆదివారం రాత్రి గోవాలోని ఓ బీచ్‌లో పోలీసులమంటూ ఇద్దరు మైనర్‌ బాలికలపై నలుగురు దుండగులు చేసిన సామూహిక అత్యాచారం సంచలనం రేపింది. ఆ సామూహిక అత్యాచార ఘటనపై అనాలోచితంగా చేసిన ‘ఆత్మపరిశీలన’ వ్యాఖ్యలు సీఎంకు తలబొప్పి కట్టించాయి. హోమ్‌శాఖ పగ్గాలు కూడా తన చేతిలోనే ఉన్న ముఖ్య మంత్రి ‘పట్టుమని 14 ఏళ్ళ కన్నకూతుళ్ళు అంత రాత్రివేళ బీచ్‌లో ఎందుకున్నారో వాళ్ళ తల్లి తండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అంటూ అసెంబ్లీ సాక్షిగా నోరుజారారు. పనిలో పనిగా, ‘పిల్లలు తమ మాట వినరని, బాధ్యతంతా ప్రభుత్వం మీద, పోలీసుల మీద పెట్టకూడదు’ అని హితవు పలికారు. తీవ్రవిమర్శల పాలయ్యారు. 

గోవా సీఎం వ్యాఖ్యల దెబ్బతో ఇలాంటి సమయాల్లో పాలకుల బాధ్యత ఏమిటన్నది చర్చనీ యాంశమైంది. ఇది ఓటు రాజకీయాల్లో నష్టం తెస్తుందని గ్రహించగానే, సీఎం సర్దుబాటు మొదలు పెట్టారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆయన నష్టనివారణలో ఉండగానే, సహచర సాంస్కృతిక మంత్రి ‘ప్రతి ఆడపిల్ల వెనుకా భద్రతకు ఓ పోలీసును పెట్టడం ఎంతవరకు సాధ్యం’ అంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నించడం విచిత్రం. అలా మరిన్ని విమర్శలకు తావిచ్చారు. తప్పొప్పుల తరాజు ఎలా ఉన్నా, ముందుగా బాధితులకు అండగా నిలవాలి. ఆ పని చేయకుండా బాధితులనే తప్పుబట్టే సామాజిక, రాజకీయ దురలవాటుకు గోవా ఉదంతం మరో ఉదాహరణ.

గమనిస్తే, గోవాలో వారం రోజుల వ్యవధిలో మూడు అత్యాచారాల సంఘటనలు జరిగాయి. ఒక ఘటనలో బీచ్‌లో మైనర్‌ బాలికల రేప్‌. మరో ఘటనలో ఉద్యోగమిస్తారని ఈశాన్యం నుంచి నమ్మి వచ్చిన పాతికేళ్ళ యువతిని ఇంట్లో బంధించి, రోజుల తరబడి అత్యాచారం. వేరొక ఘట నలో... 19 ఏళ్ళ ఆడపిల్లపై ట్రక్‌ డ్రైవర్ల అమానుషం. 2019తో పోలిస్తే 2020లో గోవాలో నేరాల రేటు 17 శాతం పెరిగిందనేది నిష్ఠురసత్యం. అలాంటి ఘటనల్ని అరికట్టి, ఆడవాళ్ళకు భద్రత, భరోసా కల్పించాల్సింది పాలకులేగా! కానీ దీన్ని ‘పురుషుల హింస’గా కాక ‘స్త్రీల భద్రత’ అంశంగా చిత్రిస్తూ, గోవా పెద్దలు మొద్దుబారిన మనసుతో వ్యాఖ్యలు చేయడమే విస్మయం కలిగిస్తోంది. 

పిల్లల పెంపకం, బాగోగుల విషయంలో తల్లితండ్రులదే ప్రథమ బాధ్యత అనేది ఎవరూ కాదనరు. కానీ ఆ వాదనను అడ్డం పెట్టి, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావాలనీ, చీకటి పడితే బయటకు రాకూడదనీ పాతకాలపు పితృస్వామ్య భావజాలంతో ప్రభుత్వాలు ప్రవర్తిస్తేనే అసలు చిక్కు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు పిల్లల పెంపకం పాఠాలు చెబుతుంటే ఏమనాలి? పౌరుల భద్రతకు బాధ్యత వహించాల్సిన పాలకులే... పొద్దుపోయాక బయటకొస్తే తమ పూచీ లేదన్నట్టు మాట్లాడితే ఇంకెవరికి చెప్పుకోవాలి? 
పర్యాటకానికి మారుపేరైన గోవా, అక్కడి బీచ్‌లు వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఆనవా యితీగా మారింది. అంతర్జాతీయ పర్యాటకులు కూడా పెద్దయెత్తున వచ్చే ఆ సముద్రతీరాలలో నిర్ణీత సమయం దాటాక ఎవరినీ అనుమతించకపోవడం ప్రభుత్వాలు తలుచుకుంటే అసాధ్యం కాదు. అలాగే, పెరిగిన సాంకేతికత, ఆధునిక డ్రోన్‌ టెక్నాలజీతో బీచ్‌ల వెంట గస్తీ కూడా కష్టమేమీ కాదు. డ్రోన్‌ పరిజ్ఞానంలో ఎంతో పురోగతి సాధించిన ఇజ్రాయెల్, అమెరికా, చైనా లాగా మనమూ శాంతి భద్రతల పరిరక్షణకూ, పోలీసు పహారాకూ డ్రోన్ల వినియోగాన్ని విస్తరించవచ్చు. నేరాలను అరికట్టవచ్చు. ప్రాణాలను కాపాడవచ్చు. ఇలా చేయదగినవి చేతిలో ఎన్నో ఉండగా, ‘లైంగిక హింస అనివార్యం... తప్పు మాది కాదు మీదే’ అన్నట్టు పాలకులు మాట్లాడడమే అసలు తప్పు. 

గోవా జనాభాలో నూటికి 35 మంది పర్యాటక రంగంపైనే ఆధారపడ్డారు. ఆ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 16.43 శాతం ఆదాయం (దాదాపు 200 కోట్ల డాలర్లు) పర్యాటకానిదే. కరోనా వల్ల వేల కోట్ల నష్టం, సగం మందికి పైగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో గోవా మళ్ళీ పుంజుకోవాలంటే సర్కారు చేయాల్సింది ఎంతో ఉంది. కానీ, తాజా ఉదంతాలతో ఆ రాష్ట్రం సురక్షితం కాదనే భావన పర్యాటకులకు కలిగితే ఆ తప్పు ఎవరిది? 

ఆ మాటకొస్తే అత్యాచారాల్లోనే కాదు... ఇంకా అనేక విషయాలలో గోవా సర్కారు అలక్ష్యం, అశ్రద్ధ దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రెండున్నర నెలల క్రితం మే 16న విరుచుకుపడ్డ టౌక్టే తుపానులో గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో పాటు గోవా తీవ్రంగా నష్టపోయింది. కానీ, ఇప్పటి వరకు సరైన లెక్కలు చెప్పి, కేంద్ర ఇస్తానన్న సాయం అందుకోవడం కూడా గోవా సర్కారుకు కష్టంగా ఉన్నట్టుంది. సాయం కోరడంపై సర్కారు సరైన దృష్టి పెట్టనే లేదు. పైపెచ్చు, తుపాను నష్టం రూ. 146 కోట్ల దాకా ఉందని సీఎం అంటుంటే, రూ. 9 కోట్లని అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం పేర్కొనడం మరీ ఆశ్చర్యకరం. మరి, రాష్ట్రంలో అత్యాచారాల మొదలు ఇలాంటి ఎన్నో అంశాలలో తక్షణం ఆత్మపరిశీలన అవసరమైంది ఎవరికి? అందరికీ అర్థమవుతున్న ఆ జవాబును గోవా సీఎంకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందంటారా?  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top