
ఆ రూట్లలో విమానాలకు లైన్‌క్లియర్
న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం నాలుగున్నర నెలల పాటు తన గగనతలంపై విధించిన నియంత్రణలను పాకిస్తాన్ మంగళవారం ఎత్తివేసింది. పౌర విమాన సేవలకు గగనతలాన్ని అనుమతిస్తున్నట్టు ప్రకటన జారీచేయడంతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ రూట్లలో దేశ గగనతలాన్ని తక్షణమే తెరుస్తున్నట్టు పాక్ పౌరవిమానయాన అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
పాకిస్తాన్ ప్రకటనతో భారత్ సైతం ఇరు దేశాల మధ్య సాధారణ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు సవరించిన ఎయిర్‌మెన్ నోటీస్ (నోటం)లో పేర్కొంది. ఇరు దేశాల ప్రకటనతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య గతంలో నడిచిన అన్ని రూట్లలో పౌర విమాన సేవలను పునరుద్ధరిస్తారు. తాజా ఉత్తర్వులతో విమాన ప్రయాణీకులకు, విమానయాన సంస్ధలకు భారీ ఊరట లభించింది. భారత్, పాక్‌ల తాజా ఉత్తర్వులతో ఇరు దేశాల గగనతలాల్లో ఎలాంటి నియంత్రణలు లేకుండా మూసివేసిన ఎయిర్ రూట్లలో విమానాల రాకపోకలు ప్రారంభమవడం ఊరట ఇస్తుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.