‘బతుకులు అధ్వానంగా ఉన్నాయి.. దయచేసి క్షమించండి’

Farmers Seeks Apology For Inconvenience To Delhi People Over Kisan Rally - Sakshi

రామ్‌లీలా మైదానం ముందు అన్నదాతల కరపత్రాలు

సాక్షి, న్యూఢిల్లీ : ‘మమ్మల్ని క్షమించండి. మా వల్ల మీకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. మేము అన్నదాతలం. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మాకు లేదు. కానీ మా జీవితాల్లో కల్లోలం చెలరేగింది. మా బతుకులు అధ్వానంగా ఉన్నాయి. గత 20 ఏళ్లలో 3 లక్షల మంది రైతు సోదరులు మరణించారు. అందుకే మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, ‘మీ’ దృష్టికి తీసుకువచ్చేందుకే ఇదుగో ఇలా ర్యాలీ నిర్వహించాం’ అని రైతన్నలు రామ్‌లీలా మైదానం ప్రాంగణం ఆవరణలో అంటించిన కరపత్రాలు ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. బడా మాల్స్‌లో వందలాది రూపాయలు ఖర్చు పెట్టి సరుకులు కొనే మనం ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కూరగాయల దగ్గర నుంచి ప్రతీ వస్తువును బేరమాడి కొంటామనే  విషయాన్ని గుర్తు చేయడంతో పాటు... దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు ఈ దుస్థితి ఏర్పడటంలో మన వంతు పాత్ర కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్లతో అన్నదాతలు దేశ రాజధానిలో ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అఖిల భారత కిసాన్‌ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు వీరిని జంతర్‌మంతర్‌ వద్దే అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్‌ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో ఢిల్లీ ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తూ రైతన్నలు కరపత్రాలు అంటించారు. వారి సమస్యలను వివరించడంతో పాటుగా తాము పంటను అమ్ముకునేటపుడు దళారీలు చెల్లించే ధరకు, అవి వినియోగదారులను చేరే నాటికి ఉంటున్న ధరకు వ్యత్యాసాన్ని చూపిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. ‘పండించినపుడు కిలో పప్పు ధర రూ. 46. కానీ మార్కెట్‌లో 120 రూపాయలు. కిలో టమాట ధర రూ.5. అదే వినియోగదారుడిని చేరే వరకు రూ.30, రైతుల వద్ద కిలో ఆపిల్‌ ధర. 10, అదే అమ్మకం నాటికి 110 రూపాయలు అంటూ వివిధ సరుకులకు సంబంధించిన ధరల వ్యత్యాసాన్ని పొందుపరిచిన అన్నదాతలు... ‘రైతులుగా తక్కువ ధరకు అమ్ముకుంటాం. వినియోగదారులుగా ఎక్కువ ధర వెచ్చించి కొనుక్కుంటాం’  అంటూ దళారీ వ్యవస్థ రైతులకు చేస్తున్న అన్యాయం గురించి తెలియజేశారు.

కాగా ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్‌ కుమార్, హన్నన్‌ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్‌ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top