రైతు ర్యాలీ.. అర్ధరాత్రి అనుమతి

Farmers Allowed to Enter Delhi Midnight - Sakshi

కిసాన్‌ ఘాట్‌లో ముగిసిన కిసాన్‌ ర్యాలీ

న్యూఢిల్లీ: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) తలపెట్టిన కిసాన్‌ క్రాంతి యాత్ర ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం ఈ యాత్రను పోలీసులు ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో అడ్డుకున్న విషయం తెలిసిందే. బీకేయూ అధ్యక్షుడు నరేశ్‌ తికాయత్‌ ఆధ్వర్యంలో  ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులను దేశరాజధాని ఢిల్లీ నగరంలోకి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ధ్వంసం చేసి ప్రవేశించే యత్నం చేసిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. అయినా కూడా రైతులు వెనకడుగు వేయలేదు. అర్థరాత్రి అయినా వెనక్కి వెళ్లకుండా అక్కడే బస చేశారు. మరోవైపు  పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రావడంతో అర్ధరాత్రి బారికేడ్లు తొలిగించి అనుమతించారు. దీంతో రైతులు చేపట్టిన పాదయాత్ర కిసాన్‌ ఘాట్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ముగిసింది.

ఈ సందర్భంగా నరేశ్‌ తికాయత్‌ మాట్లాడుతూ.. ‘ఇది రైతుల విజయం. బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో దారుణంగా విఫలమైంది. మేం గత 12 రోజులుగా ర్యాలీ చేస్తున్నాం. రైతులంతా అలసిపోయారు. మేం మా డిమాండ్స్‌, హక్కుల కోసం మా పోరాటం కొనసాగిస్తాం. కానీ ప్రస్తుతం ఈ ర్యాలీని ముగిస్తున్నాం’  అని తెలిపారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతుల ప్రధాన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు.

తమ డిమాండ్లను అమలు చేయాలని బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న హరిద్వార్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన సుమారు 70 వేల మంది రైతులు పాల్గొన్నారు.

చదవండి: రైతు ర్యాలీ భగ్నం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top