రిస్క్ చేసినా నో ‘పే’! | extreme difference between officers and in security personnel risque pay | Sakshi
Sakshi News home page

రిస్క్ చేసినా నో ‘పే’!

Jul 24 2014 11:16 PM | Updated on Apr 3 2019 4:53 PM

అగ్నిప్రమాదం జరిగినప్పుడు మాతోపాటు అధికారులు రిస్క్ పనుల్లో పాల్గొంటారు.. కానీ మాకు రూ.500, అధికారులకు రూ.5000 లోపు చెల్లిస్తున్నారు.. ఎందుకీ వివక్ష’ అని జవాన్లు బీఎంసీని నిలదీస్తున్నారు.

సాక్షి, ముంబై : ‘ అగ్నిప్రమాదం జరిగినప్పుడు మాతోపాటు అధికారులు రిస్క్ పనుల్లో పాల్గొంటారు..  కానీ మాకు రూ.500, అధికారులకు రూ.5000 లోపు చెల్లిస్తున్నారు.. ఎందుకీ వివక్ష’ అని జవాన్లు బీఎంసీని నిలదీస్తున్నారు.  అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న జవాన్‌లకు చెల్లించే ‘రిస్క్ పే’ విషయంలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చిన్న చూపు చూస్తోంది. జవాన్లతో పనిచేస్తున్న అధికారులు ఎలాంటి రిస్క్ పనుల్లో పాల్గొనకున్నప్పటికీ రిస్క్ పే తోపాటు ఇతర భత్యాలను బీఎంసీ పెద్ద మొత్తంలో చెల్లిస్తోంది.

  ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను ఫణంగాపెట్టి పనిచేస్తున్న జవాన్లకు మాత్రం రిస్క్‌పేగా కేవలం రూ.500 చెల్లిస్తోంది. అదే అధికారులకు రూ. 2,000-5,000 వరకు రిస్క్ పే, ఇతర భత్యాలు అందజేస్తోంది. నగరంలో ఎక్కడ, ఎలాంటి ప్రమాదం జరిగినా ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక శాఖ వాహనాలే. జవాన్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సాధ్యమైనంత త్వరలో మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తారు. వీరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రిస్క్ పే అందజేస్తున్నారు. గతంలో ఇది రూ.50 మాత్రమే ఉండేది. కొద్ది సంవత్సరాల కిందట దీన్ని రూ.500 పెంచారు.కానీ, అధికారులు, జవాన్ల మధ్య రిస్క్‌పేలో  వివక్ష వల్ల జవాన్లు, అధికారుల  మధ్య చిచ్చు రగులుతోంది.

 రిస్క్ మాది..భత్యం ఉన్నతాధికారులకా?
 ‘2008 నవంబరు 26న ఉగ్రవాదులు ముంబైలో దాడులు చేసినప్పుడు అధికారులతో మేమూ  పాల్గొన్నాం. సమానంగా విధులు నిర్వహించి పరిస్థితులను చక్కదిద్దాం. అందుకు అధికారులు ప్రత్యేక భత్యం మంజూరు చేయించుకున్నారు. యూనిఫార్మ్ విషయంలో ఆందోళన చేపట్టినప్పటికీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. విధి నిర్వహణలో గాయపడితే మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాలంటే ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచిచూడాల్సి వస్తోంది. ఏదైనా నిర్లక్ష్యం జరిగితే అధికారులే దర్యాప్తుచేస్తారు. వారే తెర దించుతారు.

వాస్తవానికి దర్యాప్తు పనులు బీఎంసీకి చెందిన విజిలెన్స్ డిపార్టుమెంట్ అధికారులు చేయాలి. అనేక సందర్భాలలో వారి ఇళ్లల్లో కూడా పనులు చేయాల్సి వస్తోంది. ఫిర్యాదు చేయాలంటే మళ్లీ ఈ అధికారుల వద్దకే వెళ్లాలి. మంటలను అరికట్టేందుకు ప్రత్యేకంగా అందజేసిన పీపీఎస్ సెట్టును ధరించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నామని’ జవాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిస్క్‌పేలో వివక్ష చూపుతున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement