ఉరి మూడోసారీ?

Execution Of Convicts In Nirbhaya Case Postponed For The Third Time - Sakshi

నిర్భయ దోషుల ఉరితీత మళ్లీ వాయిదా

ఒక దోషి పవన్‌ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటంతో ఢిల్లీ కోర్టు నిర్ణయం

నిప్పుతో చెలగాటం తగదని దోషి తరఫు న్యాయవాదిపై కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలు మూడోసారి కూడా వాయిదాపడింది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. క్షమాభిక్ష ఒక ముఖ్యమైన రాజ్యాంగబద్ధ అవకాశం అని కోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి, ట్రయల్‌ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్‌ వారెంట్‌ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ నేటి(మార్చి 3) ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. తాజా, ఆదేశాలతో ఆ ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. రాష్ట్రపతి వద్ద  క్షమాభిక్ష పిటిషన్‌ పరిశీలనలో ఉండగా మరణ శిక్ష విధించడం సరికాదని అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ధర్మేంద్ర రానా స్పష్టం చేశారు.

బాధితుల వైపునుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్ప టికీ.. ఏ దోషి అయినా తనకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలనూ వినియోగించుకోకుండా ఆపకూడదని ఆయన పేర్కొన్నారు. క్షమాభిక్ష పిటిషన్‌ ఒక ముఖ్యమైన చట్టబద్ధ అవకాశం అనీ, అందుకే ఉరిని వాయిదా వేయడానికి తాను సంకోచించడం లేదన్నారు. మరణ శిక్షపై స్టే విధించాలన్న పవన్‌ గుప్తా చేసుకున్న విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వులో ఉంచిన కోర్టు.. క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను ఆలస్యంగా దాఖలు చేయడంపై దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. జాగ్రత్త’ అని ఆయనపై మండిపడింది. ఎవరైనా తప్పు చేస్తే పరిణామాలెలా ఉంటాయోమీకు తెలుసనే అనుకుంటున్నామని హెచ్చరించింది. విచారణ మంగళవారం కొనసాగుతుందని తెలిపింది. (నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?)

కాగా, పవన్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరణ శిక్షపై స్టే విధించాలని కోరుతూ అక్షయ్‌ కుమార్, పవన్‌ గుప్తాలు దాఖలుచేసుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ముకేశ్‌ కుమార్‌ సింగ్, వినయ్‌ కుమార్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ల క్షమాభిక్ష పిటిషన్లను ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరణను సవాల్‌ చేస్తూ ముకేశ్, వినయ్‌ కుమార్‌లు విడివిడిగా దాఖలు చేసుకున్న పిటిషన్‌లను సైతం సుప్రీంకోర్టు గతంలో కోర్టు తోసిపుచ్చింది. అయితే అక్షయ్‌ కుమార్‌ మాత్రం తన క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణపై సుప్రీంకోర్టుకి వెళ్లలేదు. 

వ్యవస్థ వైఫల్యం: నిర్భయ తల్లి
నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష మరోమారు వాయిదాపడడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందనీ, ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోందనీ ఆమె వ్యాఖ్యానించారు. రోజు రోజుకీ విశ్వాసాన్ని కోల్పోతున్నాననీ, అయినా గట్టిగా నిలబడతాననీ, ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. అయితే కోర్టులు మాత్రం చోద్యం చూస్తూ కూర్చుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. (నిర్భయ కేసు : మరో కీలక పరిణామం

ఇది వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ దేశంలో న్యాయం ఎలా ఆలస్యం అవుతోందో ప్రపంచమంతా గమనిస్తోంది. ఏం చేసినా దోషులకు ఉరిశిక్ష పడాల్సిందే. – నిర్భయ తల్లి ఆశాదేవి

ఎవరీ ఏపీ సింగ్‌? 
నిర్భయ హత్యాచారం కేసులో ఇద్దరు దోషులు అక్షయ్‌ సింగ్, పవన్‌ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్‌ ఫ్రెండ్‌తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పదే పదే ఉరిశిక్ష అమలు వాయిదా పడుతుండటంపై ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా ‘వ్యవస్థని నవ్వుల పాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top