సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన

Employees Protest Rally Outside Parliment Over Cps - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం పార్లమెంట్ వీధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల నిరసనలో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేందర్, పలువురు ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసించారు. సీపీఎస్‌ విధానంతో  33 సంవత్సరాల పాటు పని చేసి రిటైర్ అయితే ఏ భరోసా లేకుండా పోతున్నదని టి ఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన పెన్షన్‌ విధానంతో అనేక మంది ఉద్యోగులు నష్టపోతున్నారని..గతంలో ఉన్న ఓపిఎస్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. సీపీఎస్ విధానాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కత్తెర వేశారని అన్నారు.ఉద్యోగ వ్యతిరేక విధానాలను విరమించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నా కేంద్రం దురహంకారంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.

ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధానంతో నష్టం జరుగుతున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎస్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించుకొని పిఆర్సీలు సాధిస్తున్నామని అన్నారు. ఉద్యోగుల ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉందని పన్నుల రూపంలో 3 నెలల జీతాన్నికేంద్రమే తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ ఎంపీలు కేంద్రానికి లేఖలు కూడా రాసారని చెప్పారు.ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేటికరిస్తే ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ జనవరిలో దేశవ్యాప్త సమ్మె చేపట్టే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top