
లాభాపేక్షతోనే ప్రకృతి ప్రకోపాలు..
పనాజీ : పర్యావరణ పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కేరళ తరహాలో గోవా సైతం ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. కొన్నేళ్ల కిందట పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నేతృత్వంలో చేపట్టిన సర్వే సారాంశంపై విస్తృతంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ‘పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి..కేరళలో ఉన్న మాదిరి అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు గోవాలో లేకున్నా గోవాలోనూ ఈ తరహా సమస్యలు ఎదురవుతాయ’ని కేరళను అతలాకుతలం చేసిన వరదలను ఉటంకిస్తూ గాడ్గిల్ పేర్కొన్నారు.
లాభాలపై ఉన్న తాపత్రయంతోనే స్వార్థం కారణంగా పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపట్టకపోవడమే ఈ అనర్ధాలకు కారణమని వ్యాఖ్యానించారు. గోవాలో అక్రమ మైనింగ్‌తో రూ 35,000 కోట్లు అక్రమంగా ఆర్జించారని కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎంబీ షా కమిషన్ వెల్లడించిందని గాడ్గిల్ గుర్తుచేశారు. పర్యావరణ నిబంధనల అమలును ప్రభుత్వాలు నీరుగారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సక్రమంగా పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వం దాని వెన్నువిరుస్తోందన్నారు. మైనింగ్ కంపెనీలు పర్యావరణ ప్రభావ అంచనాపై నివేదికల్లో తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాయని తప్పుపట్టారు.