ఇది భారత్‌కు హెచ్చరిక | Sakshi
Sakshi News home page

ఇది భారత్‌కు హెచ్చరిక

Published Sun, Jul 3 2016 3:17 AM

Dhaka cafe attack: Bangladeshi militants id'd in siege, officials say

* భారత్-బంగ్లా సరిహద్దులో భద్రత అంతంతే!
* అక్రమ చొరబాటుదారులకు రాజకీయ అండ

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం నాటి ఉగ్రవాద ఘటన.. ఆ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత్‌కు  ఘాటైన హెచ్చరిక లాంటిదే. బంగ్లా సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల కట్టడిపై భారత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఏర్పడింది.  ప్రపంచంలో సరైన  భద్రతలేని సరిహద్దు ప్రాంతాల్లో ఇది  ఒకటి. ఇటీవల  ఇక్కడ భారత్ కాస్త నిఘా పెంచినా బంగ్లా నుంచి చొరబాట్లు సాగుతూనే ఉన్నాయి.

భారత-బంగ్లా సరిహద్దు వెంబడే ఎక్కువగా ఉగ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  పేదరికంతోపాటు వివిధ కారణాలతో భారత్‌లోకి వస్తున్న ప్రజలతో ఉగ్రవాదులూ కలిసిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 1971 నుంచి 10 లక్షలకు పైగా బంగ్లాదేశీయులు భారత్‌లోకి ప్రవేశించారు. దీని ప్రభావం ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడుతోంది. ఆయా రాష్ట్రాల్లో స్థానికుల ఆందోళనకు ఇదే ప్రధాన కారణం.

రాజధాని ఢిల్లీతోసహా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులతో వెలసిన కాలనీలున్నాయి. ఇలా వలస వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో పేలుళ్లకు పాల్పడటం తెలిసిందే. బంగ్లాలో శిక్షణ పొంది భారత్‌లో ప్రవేశించి భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారు. అక్రమ వలసలకు, వాటికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలకు అడ్డుకట్ట వేయకపోతే భారత్‌లో భారీ విధ్వంసం తప్పద’ని అంతర్జాతీయ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉగ్రవాద సంస్థలు కూడా బంగ్లాలో పేదరికాన్ని ఆసరా చేసుకుని వారిలో విషబీజాలు నాటి భారత్‌పైకి ఉసిగొల్పుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఆగ్నేయాషియా దేశాల్లో నిఘా పెరగటంతో అక్కడి ఉగ్రవాద సంస్థలూ బంగ్లాను స్థావరంగా చేసుకుంటున్నాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement