ఢిల్లీ ఓట్ల లెక్కింపు నేడే

Delhi Vote Count On 11/02/2020 - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నేడు జరిగే కౌంటింగ్‌ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు..ఎన్నికల సంఘం తుది పోలింగ్‌ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్‌ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్‌ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, సర్‌ సీవీ రామన్‌ ఐటీఐ, రాజీవ్‌ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్‌బూత్‌లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్‌ అధికారులు పరిశీలిస్తారని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సందీప్‌ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top