20న నిర్భయ దోషుల ఉరి

Delhi court fixes March 20 as date of execution of 4 convicts - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి వేయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయని, కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్‌ ఇటీవల రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడం.. దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరి తేదీలు ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును చేరింది. దీంతో  ఈ నెల 20న ఉదయం అయిదున్నరకు ఉరి వేయాల్సిందిగా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా తెలిపారు.

దీనికి ఎలాంటి నోటీసు అవసరం లేదని ప్రాసిక్యూషన్‌ లాయర్‌ తెలిపారు. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. ఈ నెల 20 ఉదయం తమ జీవితాల్లో వెలుగు నింపే ఉదయమని చెప్పారు. దోషుల మరణాన్ని చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టంలోని లొసుగులను దోషులు చక్కగా ఉపయోగించుకుంటున్నారని, ఏది జరగకూడదో అదే జరుగుతోందని శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నా తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు కోర్టుల మీద నమ్మకం కోల్పోరని భావిస్తున్నట్లు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఖరారు చేశాక అవి అమలు జరిగితీరాలని చెప్పింది.

దానిపై 23న విచారిస్తాం: సుప్రీంకోర్టు
నిర్భయ కేసు దోషులను ఒకేసారి ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఒకే నేరానికి సంబంధించిన దోషులను వేరువేరుగా ఉరి తీసే అంశంపై లోతుగా పరిశీలన జరుపుతామని చెప్పింది. ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు మార్చి 20న దోషులకు ఉరిని ఖరారు చేసిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జస్టిస్‌ ఆర్‌ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. దోషులు చట్టంలోని లొసుగులతో ఆడుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 23న విచారణ జరుగుతుందని, ఇకపై వాయిదాలు ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top