భారత్‌ బంద్‌ హింసాత్మకం

Dalit groups Bharat bandh protest turns violent, leaves eight dead - Sakshi

చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి వందల మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌లో ఆరుగురు, యూపీలో ఇద్దరు, రాజస్తాన్‌లో ఒకరి మృతి

ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును నిరసిస్తూ దళితుల ఆందోళన

100కు పైగా రైళ్ల అడ్డగింపు.. పలుచోట్ల ఆస్తులకు నిప్పు

దక్షిణాదిలో కనిపించని బంద్‌ ప్రభావం

పలు చోట్ల స్కూళ్లకు సెలవు, ఇంటర్నెట్, మొబైల్‌ సేవల నిలిపివేత

యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లకు ప్రత్యేక బలగాలు

న్యూఢిల్లీ/భోపాల్‌/లక్నో:  ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిర్వహించిన భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటుచేసుకుంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు చోట్ల దళిత ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోవడంతో పాటు పోలీసులతో ఘర్షణ పడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో 9 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు.


                    జోధ్‌పూర్‌లో రాస్తారోకోలో పాల్గొన్న వందలాది మంది దళితులు, భీమ్‌ సేన కార్యకర్తలు

మధ్యప్రదేశ్‌లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్తాన్‌లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు. పంజాబ్‌లో ఉదయం నుంచే ఆర్మీ, పారామిలటరీ బలగాల్ని సిద్ధంగా ఉంచారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్‌ల్లో కూడా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పలు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా రైళ్లను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణాకు తీవ్రంగా అంతరాయం కలిగింది. రైల్వే శాఖ 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఉత్తర, తూర్పు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిన బంద్‌ ఛాయలు దక్షిణాదిలో కనిపించకపోవడం గమనార్హం.

                                             ముంబైలో నిరసనకార్యక్రమంలో నినాదాలిస్తున్న కార్యకర్త    
హుటాహుటిన బలగాలు
బంద్‌ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. ఇంటర్నెట్, మొబైల్‌ సేవల్ని నిలిపివేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఆస్తుల దహనం, కాల్పులు, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఆందోళన సందర్భంగా ఎదురుకాల్పులు జరగడంతో మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో ముగ్గురు, గ్వాలియర్‌ జిల్లాలో ఇద్దరు, మొరేనా జిల్లాలో ఒక్కరు మరణించారు’ అని మధ్యప్రదేశ్‌ ఐజీ (శాంతి భద్రతలు) మార్కండ్‌ దేవ్‌స్కర్‌ తెలిపారు. మృతుల్లో నలుగురు దళితులు, ఇద్దరు ఉన్నత కులాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒకరు, మీరట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఒకరు మరణించగా.. 9 మంది పోలీసులతో సహా 26 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్‌లకు అల్లర్ల నిరోధానికి ప్రత్యేక్ష శిక్షణ పొందిన 1,700 మందిని హుటాహుటిన పంపింది. అలాగే యూపీకి ఎనిమిది కంపెనీలు, మధ్యప్రదేశ్‌కి నాలుగు, రాజస్తాన్‌కు మూడు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) సిబ్బందిని కేంద్రం తరలించింది.

మధ్యప్రదేశ్‌లో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ
పరిస్థితి అదుపు తప్పడంతో మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్, భింద్, మొరేనా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. చంబల్, గ్వాలియర్, సాగర్‌ రీజియన్లలో ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల రాళ్లు రువ్వడం, దహనాలు, లూటీలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు కాల్పులు జరపడంతో మొరేనా జిల్లాలో విద్యార్థి నాయకుడు రాహుల్‌ పాఠక్‌ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఒక్కసారిగా హింస మిగతా ప్రాంతాలకు విస్తరించడంతో గ్వాలియర్‌ పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ ఉమేశ్‌ శుక్లా చెప్పారు. భింద్‌ జిల్లాలో మరణించిన వ్యక్తిని మహావీర్‌ సింగ్‌గా గుర్తించామని, మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఝబువాలో ఆందోళనకారులు దుకాణాల్ని లూటీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. భోపాల్‌లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు పలు వాహనాల్ని ధ్వంసం చేశారు.   

యూపీలో 75 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌ హింసలో 40 మంది పోలీసులు సహా 75 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ (శాంతి భద్రతలు) ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. విధ్వంసానికి, దహనాలకు పాల్పడిన 450 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరట్‌లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే యోగేశ్‌ వర్మను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అజాంగఢ్‌లో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగ్రా, హాపూర్, మీరట్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలు పంపాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ కేంద్రాన్ని కోరారు. యూపీలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లతో అనేక రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు.  

పంజాబ్‌లో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా
హరియాణాలో అంబాలా, రోహ్‌తక్‌తో పాటు చండీగఢ్‌లోను ఆందోళనలు కొనసాగాయి. భారత్‌ బంద్‌ నేపథ్యంలో పంజాబ్‌లో జరగాల్సిన 10, 12వ తరగతి సీబీఎస్‌ఈ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల ఆందోళనకారులు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. డెహ్రాడూన్‌ , రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. ఘజియాబాద్‌లోని ఒక గుంపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మండి హౌస్‌ ప్రాంతంలో రోడ్లపై ఆందోళనకారులు బైఠాయించి జై భీమ్‌ అంటూ నినాదాలు చేశారు.

రైల్వే ట్రాక్‌లు, రోడ్లను దిగ్బంధించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన 30 మందిని రాజస్తాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాలో ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌ను ముట్టడించి టికెట్‌ కౌంటర్లను మూయించివేశారు. పదుల సంఖ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఒడిశా, జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనల వల్ల జన సామాన్యానికి అంతరాయం కలిగింది. గుజరాత్‌లోని ప్రధాన పట్టణాల్లో రోడ్లపై ఆందోళనలు చేపట్టడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.  

సుప్రీం తీర్పులో ఏముంది?
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దని మార్చి 20న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసుల్లో వారంలోగా ప్రాథమిక విచారణ నిర్వహించి ఫిర్యాదు సరైందేనని నిర్ధారించుకోవాలని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే ముందస్తు బెయిల్‌ కూడా ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా అరెస్టు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వోద్యోగిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఫిర్యాదు చేస్తే.. ఆ ఉద్యోగికి అరెస్టుకు సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పనిసరి అని చెప్పింది. ఇతరులపై ఫిర్యాదుల విషయంలో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ లేదా డీఎస్‌పీ అనుమతి అవసరమంది. ఈ చట్టం ఆసరాగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలూ చాలా జరుగుతున్నాయంది.  

సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్‌

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి

వీలైనంత తొందరగా విచారించాలని కోరే చాన్స్‌

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలుచేసింది. దళితులు, గిరిజనులపై వేధింపుల్ని అడ్డుకునేలా ఉన్న నిబంధనలపై సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టం అసలు ఉద్దేశాన్ని నీరుగార్చేలా ఉందని పిటిషన్‌లో పేర్కొంది. దేశంలోని గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. పార్లమెంటు శాసన విధానానికి ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ కేసును బహిరంగంగా విచారించాలంది.

ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా దళితులు, గిరిజనులు వెనుకబడే ఉన్నారనీ, వారిపై పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్‌ను వీలైనంత తొందరగా విచారించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ మంగళవారం సుప్రీంకోర్టును కోరే అవకాశముంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం విభేదిస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. సుప్రీం తీర్పును నిలిపివేయాలని ఆల్‌ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్‌ దాఖలుచేసిన రివ్యూ పిటిషన్‌ను వెంటనే విచారించేందుకు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం నిరాకరించింది.

సంయమనం పాటించండి
హింసాత్మక సంఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదని, తీర్పు అంశాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో సమగ్ర రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. రివ్యూ పిటిషన్‌పై ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయం తీసుకుందని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ అభినందించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, మైనార్టీలపై అత్యాచారాల ఘటనలు పెరిగిపోయాయని కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ ఆరోపించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top