మొక్కుబడిగా ఓ ఎఫ్‌ఐఆర్! | CTD file FIR without accused names | Sakshi
Sakshi News home page

మొక్కుబడిగా ఓ ఎఫ్‌ఐఆర్!

Feb 20 2016 3:04 PM | Updated on Oct 5 2018 9:09 PM

మొక్కుబడిగా ఓ ఎఫ్‌ఐఆర్! - Sakshi

మొక్కుబడిగా ఓ ఎఫ్‌ఐఆర్!

దేశ రక్షణ వ్యవస్థకే సవాలు విసురుతూ.. పఠాన్‌కోట్‌పై ఉగ్రమూకలు చేసిన దాడికి పాకిస్తాన్ నుంచి ఎట్టకేలకు స్పందన కనిపించింది.

పఠాన్‌కోట్ దాడి ఘటనపై పాక్ ప్రభుత్వంలో కదలిక
భారత్ ఆరోపణలు బేఖాతరు
నిందితుల పేర్లు లేకుండానే కేసుల నమోదు

న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థకే సవాలు విసురుతూ.. పఠాన్‌కోట్‌పై ఉగ్రమూకలు చేసిన దాడికి పాకిస్తాన్ నుంచి  ఎట్టకేలకు స్పందన కనిపించింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి కేసుపై ఆ దేశ  కౌంటర్ టైజం డిపార్ట్‌మెంట్(సీటీడీ) పంజాబ్‌లోని గుర్జన్‌వాలాలో మొక్కుబడిగా.. నిందితుల పేర్లు లేకుండానే ఓ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అయితే ఇది చిత్తశుద్ధిలేని చర్యగానే భారత్ భావిస్తోంది.

ఎందుకంటే ఏడుగురు భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న పఠాన్‌కోట్ దాడికి కారకులెవరనే విషయమై భారత్ స్పష్టమైన ఆధారాలను పాక్ ప్రభుత్వానికి ఇప్పటికే అందజేసింది. ఆ దేశానికి చెందిన జైష్-ఎ-మహ్మద్ సంస్థ ఈ కుట్రకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. దాడికి సూత్రధారి జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన మౌలానా మసూద్ అజరేనని ఆరోపించిన ఇండియా.. అందుకు తగిన ఆధారాలను ఇప్పటికే పాక్‌కు అందజేసింది. అజర్ సోదరుడు రవూఫ్‌తోపాటు మరో ఐదుగురికి ఈ దాడితో సంబంధమున్నట్లు ఆధారాలు చూపింది. అయితే ఇవేవీ పట్టనట్టుగా పాకిస్తాన్ మాత్రం నిందితుల పేర్లేవీ లేకుండానే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం గమనార్హం.

తగిన ఆధారాలను సేకరించేందుకే..
భారత్ చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసినట్లు సీటీడీ పేర్కొంది. అందుకు తగిన ఆధారాలు సేకరించాలంటే ముందుగా చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు కావాల్సి ఉంటుందని సీటీడీ అధికారి ఒకరు తెలిపారు. పాక్ నేర శిక్షాస్మృతి ప్రకారం 320, 324, 109 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. ఇవన్నీ ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద నమోదైన కేసులేనని స్పష్టం చేశారు. త్వరలో విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. 

ఆ నేపథ్యంలోనేనా?
పాకిస్తాన్-భారత్ దేశాధినేతల భేటీ నేపథ్యంలోనే పాక్ ప్రభుత్వం ఈ కంటితుడుపు చర్యను తీసుకున్నట్లుగా భారత్ భావిస్తోంది. జనవరి 2న దాడి జరిగిన తర్వాత భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పూర్తి ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందజేశారు. అందులో పాక్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల వివరాలను పొందుపర్చారు. అయినప్పటికీ వారి పేర్లేవీ లేకుండానే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంమంటే... ప్రస్తుతానికి భారత్‌కు సమాధానం చెప్పుకునేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో నరేంద్రమోదీ-నవాజ్ షరీఫ్‌లు భేటీ అవుతారనే విషయంపై కొంత స్పష్టత వస్తున్న నేపథ్యంలో భేటీలో భారత్ లేవనెత్త ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకే పాకిస్తాన్ ఈ ఎఫ్‌ఐఆర్ పథకానికి తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారత్ అసంతృప్తి..
పాకిస్తాన్ చ ర్యపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జైష్-ఎ-మహ్మద్ పేరుగానీ, ఆ సంస్థకు చెందిన మసూద్ అజర్ పేరుగానీ లేకుండా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం నిరాశ పర్చిందని భారత్ పేర్కొంది. తాము ఆధారాలను అందజేసినా నిందితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంలో పాకిస్తాన్ ఎందుకు విఫలమైందో అర్థం కావడంలేదని భారత భద్రతా విభాగానికి చెందిన అధికారి ఒకరు అన్నారు.

ఇప్పుడేమీ మాట్లాడలేం..
భారత్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై తాము ఇప్పుడేమీ మాట్లాడలేమని పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి రాణా సనాఉల్లా పేర్కొన్నారు. ‘ఎఫ్‌ఐఆర్ నమోదైంది.. విచారణ జరగనివ్వండి. దోషులెవరో తేలితే వారిపై తప్పకుండా చర్యలుంటాయి. దాడికి కారకులెవరే విషయమై ఇప్పడేమీ మాట్లాడలేమ’న్నారు. భారత్ అందజేసిన ఆధారాలపై కూడా మాట్లాడడానికి రాణా నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement