కరోనాపై ‘కంటికి కనిపించని యుద్ధం’

COVID-19: Armed forces adequately protected says Rajnath Singh - Sakshi

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో త్రివిధ దళాలను, వ్యూహాత్మక సంపత్తిని కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న భద్రతా బలగాలు.. మరో వైపు సరిహద్దుల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని దేశం చేస్తున్న ‘అతిపెద్ద అదృశ్య యుద్ధం’గా ఆయన అభివర్ణించారు. ‘కోవిడ్‌–19పై సాగిస్తున్న పోరు అతిపెద్ద అదృశ్య యుద్ధం. మానవత్వంపై జరుగుతున్న యుద్ధం. దేశ ఆర్థిక భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే యుద్ధం’అని ఆయన అన్నారు.

ఉగ్ర శిబిరాలపై దాడులు యథాతథం
జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సైన్యం దాడులు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. పాక్‌ చొరబాటుదారులు సరిహద్దులు దాటి దేశంలోకి రాకముందే వారిని సైన్యం అడ్డుకుంటుందని తెలిపారు.
కోవిడ్‌–19 నుంచి కాపాడుకునే విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య శాఖ, వైద్య సంస్థల సూచనలను త్రివిధ దళాలు  పాటిస్తున్నాయన్నారు. నేవీ సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలు, కరోనా ప్రభావం సైనిక బలగాలపై పడుతుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top