మీ టూ అర్బన్ నక్సల్: గిరీష్‌ కర్నాడ్‌పై ఫిర్యాదులు

Complaints Against Girish Karnad for Wearing Urban Naxal Placard - Sakshi

బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్‌పై వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. గిరీష్‌ కర్నాడ్‌కు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలున్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది, శ్రీరామ సేన కార్యకర్తలు  పోలీసులను ఆశ్రయించారు. హత్యకు గురైన సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ ప్రథమ వర్థంతి (సెప్టెంబర్‌ 5) సందర్భంగా ‘మీ టూ అర్బన్ నక్సల్’ అన్న ప్లకార్డు ధరించడాన్ని తప్పుపడుతూ ఈ కేసు నమోదు చేశారు. వీరిలో గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎన్‌పీ అమృతేశ్  ఒకరు కావడం గమనార్హం. హిందూ జన జాగృతి సమితి సభ్యులు కూడా కర్నాడ్‌పై నగర పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నక్సలిజాన్ని సమర్ధిస్తున్న ఆయనపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు.

గిరీష్‌ కర్నాడ్‌పై హైకోర్టు న్యాయవాది ఎన్‌పీ అమృతేశ్ విధానసౌదా పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిషేధానికి గురైన సంస్థ బ్యానర్‌ను ఎవరైనా ఎలా ధరిస్తారు అని ఆయన ప్రశ్నించారు. గిరీష్ కర్నాడ్, అతని అనుచరులకు మావోయిస్టు సంబంధాలున్నారని ఆరోపించారు. ఈ ప్లకార్డును ధరించడం ద్వారా కర్నాడ్ నక్సలైట్ల హింసాత్మక కార్యకలాపాలను ప్రచారం చేశారని, అందుకు ఆయనను అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ దేశంపై తిరుగుబాటు చేయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నాడ్‌కు మద్దతుగా ప్రకాశ్ రాజ్, స్వామి అగ్నివేష్, జిగ్నేష్ మేవానీ, కన్హయ కుమార్ కూడా ఉన్నారనీ, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నక్సల్స్‌తో సంబంధాలతోపాటు భీమా కోరెగావ్‌ కేసులో గిరీష్‌కు ప్రమేయం ఉందని, ఆయనను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఈ ఫిర్యాదుపై గిరీష్ కర్నాడ్ స్పందించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. కేసు దాఖలు చేసే హక్కు అతనికి ఉంది. అలాగే తాననుకున్నది స్వేచ్ఛగా పాటించే హక్కు తనకూ వుంద’ని చెప్పారు. న్యాయాన్యాయాలను చట్టం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top