
వారసత్వం.. పాతరాతి యుగం నుంచి నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగం వరకూ.. కొనసాగుతున్న పద్దతి. పరిస్థితులు మారినా.. వ్యవస్థలు మారినా.. నేపథ్యాలు మారినా వారసత్వం మాత్రం మారడం లేదు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు రాజు మరణించిన తరువాత అతని పెద్ద కుమారుడు రాజయ్యేవాడు.. ఇదే పరిస్థితి ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ కనిపిస్తోంది. ఉపఖండంలో దాయాది దేశాలుగా భావించే భారత్, పాకిస్తాన్‌లలో వారసత్వం చుట్టే పార్టీలు, రాజకీయాలు తిరుగుతున్నాయి.
రాజకీయాలు అత్యంత శక్తివంతమైనవి. ఉపఖండంలోని 200 కోట్ల మంది ప్రజలు.. ఓటుతో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని, పాలకుడిని ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత్, అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్‌లలో రాజకీయ వారసులే.. పార్టీలను ముందుకు నడిపిస్తున్నారు. బ్రిటీష్ కాలం నుంచి పార్టీ ఒకటైతే.. దేశ ఆవిర్భావితం తరువాత ఏర్పడ్డ పార్టీ మరొకటి. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలపై ఆయా కుటుంబాలదే పెత్తనం. ఇక్కడే రాజరికంలో ఉన్నట్లు ఆయా కుటుంబాల్లోని పెద్ద కుమారులకే పార్టీ అధినేతలుగా పట్టం కట్టారు. రేప్పొద్దున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే.. వారే దేశాధినేతలు. ప్రజాస్వామ్యంలోనూ రాజరికం..అందులోనూ కుటుంబస్వామ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
రాహుల్ గాంధీ
భారత్‌లోని రాహుల్ గాంధీకి, పాకిస్తాన్‌లోని బిలావల్ జర్దారీ భుట్టోకి ఇక్కడే చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. ఇద్దరూ బ్రిటన్‌లోనే ఉన్న విద్యను అభ్యశించారు. ఇద్దరూ యువకులే. బిలావల్ పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నసమయంలో పీపీపీ పాకిస్తాన్‌లో అధికారంలో ఉంది. అప్పుడు వయసు తక్కువగా ఉండడంతో బిలావల్ ప్రధాని కాలేకపోయాడు. ఇక్కడ రాహుల్ గాంధీది అదే పరిస్థితి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004 నుంచి 2014 వరకూ అధికారంది. కాంగ్రెస్ దేశంలో దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని కాలేకపోయారు.
భారత దేశంలో గాంధీ.. అనే పేరుకు చాలా ప్రతిష్ట ఉంది. ఇక్కడ వ్యక్తికన్నా.. గాంధీ అనే ట్యాగ్‌లైన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. గత ఐదేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ దాదాపు 27 ఎన్నికల్లో వరుస పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో కొందరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారిని సంప్రదించిన ఘటనలున్నాయి. ఇన్ని వైఫల్యాలున్నా.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నారు.. ఇందుకు ప్రధాన కారణం అతను గాంధీ వారసత్వంగా రాజకీయాల్లో కోనసాగడమే.
బిలావల్..
ఇక పాకిస్తాన్‌లోనూ భుట్టే అనే ఇంటి పేరు చాలా శక్తివంతం. రాహుల్ గాంధీ కన్నా బిలావల్ భుట్టో 18 ఏళ్ల చిన్నవాడు. ప్రస్తుతం అతని వయసు 29 ఏళ్లు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని బిలావల్ ముందుకు నడిపిస్తున్నాడు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అయిన జుల్ఫీకర్‌ఆలీ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీని స్థాపించాడు. జుల్ఫీకర్‌ఆలీ భుట్టో కుమార్తె అయిన బేనజీర్ భుట్టో కూడా పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. దాదాపు దశాబ్దం కిందట బేనజీర్ భుట్టో హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే బిలావల్ పీపీపీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.
ఇద్దరిలోనూ సారూప్యతలు
బిలావల్, రాహుల్ గాంధీలు.. ఇద్దరూ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. బిలావల్ తల్లిని, తాతయ్యను పోగొట్టుకుంటే.. రాహుల్ చిన్నతనంలోనే తండ్రిని, నానమ్మను కోల్పోయాడు. ఇందిరను బాడీ గార్డులో హత్య చేయగా.. జుల్ఫీకర్ ఆలీ భుట్టోను ఉరి తీశారు. రాజీవ్, బేనజీర్‌ల మరణం కూడా ఒకేలా ఉంటుంది. పాకిస్తాన్‌లో భుట్టో కుటుంబం, భారత్‌లో నెహ్రూ-గాంధీ ఫ్యామిలీలు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశాయి. ఇద్దరు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న సమయంలో పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇద్దరూ ప్రదానులు మాత్రం కాలేకపోయారు. ఇద్దరికీ ఇంటిపేరే వరం, శాపంగానూ మారింది. యాధృచ్చికంగా రాజకీయాల్లోకి వచ్చినా తమ పార్టీలను గెలిపించేందుకు ఇద్దరూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇద్దరిలోనూ ఉన్న ప్రధాన సారూప్యత.. వివాదాలు. పాకిస్తాన్‌లో బిలావల్ భుట్టో మీద, భారత్‌లో రాహుల్ గాంధీ మీద.. ఉన్నన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మరెవరిమీద ఉండవేమో! ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్‌లో పర్వేజ్ ముషారఫ్, నవాజ్ షరీఫ్‌లు వారిమీద చేసే వివాదాస్స వ్యాఖ్యలకు కొదవ లేదు.
ఎన్నికలు ఇద్దరికీ పరీక్ష
గుజరాత్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలు రాహుల్ గాంధీ నాయకత్వ రెఫరెండమ్‌గా అందరూ భావిస్తున్నారు. ఈ కారణం వల్లే రాహుల్ గాంధీ ఎన్నడూ లేని విధంగా గుజరాత్‌లో దాదాపు 3000 వేల కిలోమీటర్లు పర్యటించారు. బిలావల్ కూడా వచ్చే ఏడాది పాకిస్తాన్ ఎన్నికల్లో తల్లి పోటీ చేసిన సింధ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి బిలావల్ భుట్టో.. వారసత్వంగానే అధినేతలు అయినా.. పార్టీలను విజయతీరాలకు చేరిస్తేనే.. వారికి రాజకీయ భవిష్యత్ ఉంటుందనేది వాస్తవం.