ఉడుకుతున్న కూర బానలో పడి పాప మృతి

Child dies after falls in boiling pot in UP school - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ జిల్లా, రాంపూర్‌ అటారి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఘోరం జరిగిపోయింది. పిల్లల మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాట్లు జరగుతున్నప్పుడు ఉడుకుతున్న కూర బానలో ప్రమాదవశాత్తు మూడేళ్ల పాప పడిపోయి కాలిన గాయాలతో మరణించింది. ఆ సమయంలో వంటవాడు ఇయర్‌ ఫోన్లు పెట్టుకొని పాటలు వింటుండంతో పాప పడిపోయిన శబ్దంగానీ, ‘అయ్యో చెల్లె పడిపోయింది. పడిపోయింది. రక్షించండి’ అంటూ ఆ పాప సోదరుడు పెట్టిన అరుపులుగానీ వినిపించుకోలేదు. సోదరుడు వచ్చి వంటివాడిని కుదిపేస్తేగానీ జరిగిన ఘోరం వంటవాడికి అర్థం కాలేదు.

పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే స్పందించి పాపను ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఒళ్లంతా కాలిపోవడంతో ఆ పాప మరణించింది. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్‌ సుశీల్‌ కుమార్‌ పటేల్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఇలాంటి ఘోరం జరగడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాలో గత నవంబర్‌ నెలలో సురేశ్‌ అనే మూడేళ్ల బాలుడు ఉడుకుతున్న పప్పు బానలో పడి చనిపోయాడు. వంటకు సమీపంలో ఆ బాలుడు ఆడుకుంటున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నవంబర్‌ నెలలోనే ఆంధ్రపదేశ్‌లోని కర్నూల్‌ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడు ఉడుకుతున్న సాంబారును చిన్న బకెట్‌లోకి తీయబోయి పొరపాటున బానాలో పడిపోయి మరణించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top