‘ఆ ఆరోపణలు అవాస్తవం.. నేను అమాయకుణ్ణి’

Chetan Bhagat Said MeToo Allegation Against Him Is False - Sakshi

నా మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో.. నన్ను వదిలి వెళ్లాల్సిందిగా నా భార్యను కోరాను. కానీ ఆమె సమాధానం విన్న తర్వాత ఆమె పట్ల నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమయ్యింది అంటున్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్‌ చేతన్‌ భగత్‌. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ ఉద్యమం’లో చేతన్‌ భగత్‌ మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు ఈ విషయం గురించి మౌనంగా ఉన్న చేతన్‌ భగత్‌ తొలిసారి మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘సాహిత్య ఆజ్‌ తక్‌’ కార్యక్రమంలో భాగంగా చేతన్‌ భగత్‌ ‘3 మిస్టెక్స్‌ ఇన్‌ మై లైఫ్‌’ పుస్తకాన్ని కూడా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన చేతన్‌ భగత్‌ తన మీద వచ్చిన లైంగిక ఆరోపణల పట్ల స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో చాలా ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయితో చాట్‌ చేశాను. తను కూడా నాతో బాగానే మాట్లాడింది. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో నేను తనతో తప్పుగా ప్రవర్తించిన మాట వాస్తవమే. అందుకు నేను తనని క్షమించమని కోరాను. ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి సారీ చెప్తున్నాను’ అన్నారు. అయితే తనపై మరో మహిళ చేసిన ఆరోపణలను మాత్రం ఖండించారు. సదరు మహిళ విషయంలో తనను నిర్దోషిగా చెప్పుకున్నారు. తన నిజాయితీని నిరూపించుకునే ఆధారాలు తన ద‍గ్గర ఉన్నాయని తెలిపారు.

తన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చిన సమయంలో తన తల్లి, భార్య తనకు చాలా మద్దతుగా నిలబడ్డారని వివరించారు. ‘నా మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో నన్ను వదిలి వెళ్లాల్సిందిగా నా భార్యను కోరాను. అందుకు ఆమె ‘నీకేమైనా పిచ్చా. పార్వతీపరమేశ్వరుల మాదిరి మనం కూడా అర్ధనారీశ్వరులం. మనం ఇద్దరం కాదు ఒక్కరమే.. అలాంటిది ఈ సమయంలో నేను నిన్ను ఎలా వదిలిపెడతాను’ అని చెప్పింది. ఆమె సమాధానం విన్న తరువాత తన పట్ల నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమయ్యింది. ఇంతలా నమ్మిన భార్యకు నేను ద్రోహం చేశాను అనిపించింది. ఇక మీదట నా జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాక ‘నేను ఒక సెలబ్రిటీనై ఉండి కూడా అందరితో చాలా కలుపుగోలుగా ఉంటాను. దాని వల్లే ఈ రోజు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నాను. జీవితంలో తప్పులు చేయడం సహజం.. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే అది క్షమించరాని నేరం. ‘మీటూ ఉద్యమం’ మంచిదే.. కానీ దానిని కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్‌ బుక్‌ ‘ది గర్ల్‌ ఇన్‌ రూమ్‌ నంబర్‌. 105’ పుస్తకం గురించి కూడా మాట్లాడారు. తొలిసారి మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన అంశాన్ని  తన కథా రచన కోసం ఎంచుకున్నానని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top