సొంతంగా కమాండో యూనిట్ ఏర్పాటు

ఆదివారం విలేకరులతో మాట్లాడుతున్న పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్


- పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం

- సరిహద్దులో భద్రత పెంచాల్సిందిగా కేంద్రానికి వినతి
చండీగఢ్: సరిహద్దులో అవసరమైన మేరకు భద్రతా దళాలను మోహరించకపోవటం వల్లే ఉగ్రవాదులు పంజాబ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారనే విమర్శల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు భద్రతకు సొంతంగా కమాండో యూనిట్ ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లాగే పంజాబ్ సరిహద్దులోనూ భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆదివారం సాయంత్రం విలేకరులకు ఈ విషయాలు చెప్పారు.'ఇటీవలి వరుస దాడులతో పంజాబ్ సరిహద్దులోనూ పటిష్ఠభద్రత అవసరమని భావిస్తున్నాం. ఆ మేరకు పఠాన్ కోట్ లో స్వాట్ బలగాల శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విన్నవించాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కమాండో యూనిట్ ఏర్పాటు చేస్తాం. ఈ బలగాలు రెండో రక్షణ పంక్తి(సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్)గా ఉపయోగపడుతుంది' అని సుఖ్బీర్ పేర్కొన్నారు.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లక్ష్యంగా జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడులు, భారత భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు జవాన్లుకాగా, ఐదుగురు ముష్కరులు. ఎయిర్ బేస్ లో నక్కిఉన్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్ కొనసాగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top