
మోదీ-అమిత్ షా (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దేశంలోని 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించాలని నిర్ణయించింది. దీంతోపాటు ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు గాను ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి 11 మంది సభ్యుల కమిటీని నియమించనున్నట్లు సీనియర్ నేతలు తెలిపారు. పార్లమెంట్ ఇన్‌చార్జిలుగా నియమితులయ్యే వారిని ఇతర ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. ‘చునావ్ తయారీ తోలి’గా పిలిచే ఎన్నికల సన్నాహక కమిటీలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన 13 కార్యక్రమాలను చేపడతాయి. బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న ఈ విధానాన్ని బీజేపీ అమలు చేయడం ఇదే ప్రథమం.
‘ఎన్నికల సన్నద్ధత పనులను ఎంత తొందరగా మేం ప్రారంభిస్తే..అంత తొందరగా మా బలహీనతలు, బలాలు తెలుస్తాయి. 2014 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను 2019 ఎన్నికల్లో సాధించాలని పార్టీ నిర్దేశించుకుంది. మోదీ–షా ద్వయం సంస్థాగత పనులపై ప్రత్యేక దృష్టి పెట్టింది’అని వారు తెలిపారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారనివారన్నారు.