
పట్నా : గత నెల 25న జరిగిన శ్రీరామ నవమి ర్యాలీలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్ కారణంగానే జరిగినట్టు ఓ నివేదిక పేర్కొంది. ఈ నెల 9న ‘యునైటెడ్ ఏజెంట్ హేట్’ అనే సంస్థ ఘర్షణలు జరగడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తూ.. ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్స్ అనే రిపోర్టును విడుదల చేసింది. ఈ సంస్థకు చెందిన కొంతమంది ఏప్రిల్ 3 నుంచి 7 తేదీ వరకు బిహార్‌లో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో పర్యటించారు. నివేదిక ప్రకారం, వారు పర్యటించిన జిల్లాల్లో ఘర్షణల వెనుక కొన్ని సారూప్యతలు కనుగొన్నట్టు తెలిపారు. ఈ ఘర్షణల వెనుక బీజేపీ, బజరంగ్ దళ్ హస్తం ఉన్నట్టు నివేదికలో తెలిపారు. చాలావరకు ఘర్షణలు జరిగిన తీరు ఒకే రీతిలో ఉందని అన్నారు.
కొత్తగా ఏర్పాటైన కొన్ని సంఘాలు జిల్లా అధికారుల నుంచి రామ నవమి ర్యాలీల కోసం అనుమతి పొందాయని, ఘర్షణలు జరిగిన జిల్లాల్లో అప్పటికప్పుడు కొన్ని కొత్త సంఘాలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహించేటప్పుడు యువకులు వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలపై రావడం, కత్తులతో, తుపాకులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రదర్శనలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఇతర మతస్తులు అధికంగా నివాసముండే ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడం కూడా ఘర్షణలకు దారితీసిందని తెలిపారు. గత కొన్ని సంత్సరాలుగా సంప్రదాయబద్ధంగా ర్యాలీలను నిర్వహిస్తున్న సంస్థలు ఇటువంటి పనులకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. దురుద్దేశంతో కొంతమంది కావాలనే కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారని, వారి దుకాణాలను తగలబెట్టడం, ఇళ్లపై రాళ్లు విసరడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు.