‘రైళ్లను అనుమతించడం లేదు.. ఇది అన్యాయం’

Amit Shah Says West Bengal Not Allowing Migrants Trains Injustice - Sakshi

మమతా బెనర్జీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లేఖ

న్యూఢిల్లీ: వలస కార్మికుల తరలింపు విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. మమత సర్కారు వ్యవహార శైలి ఇలాగే ఉంటే వలస కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా మారే అవకాశం ఉందన్నారు. వలస జీవులను స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించకపోవడం అన్యాయం అని మండిపడ్డారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 2 లక్షల మందిని సొంత రాష్ట్రాలకు చేరుకునేలా కేంద్రం చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అమిత్‌ షా శనివారం లేఖ రాశారు.(కర్ణాటకలో వలస కూలీల ఆందోళన)

‘‘పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నుంచి ఆశించినంత సహకారం లభించడం లేదు. రైళ్లను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. పశ్చిమ బెంగాల్‌ వలస కార్మికులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ తీరు వారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది’’అని అమిత్‌ షా లేఖలో పేర్కొన్నారు. కాగా కరోనా కేసులు, లాక్‌డౌన్‌ తదితర అంశాల గురించి కేంద్రం, మమత ప్రభుత్వం తరచుగా మాటల యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం లేదంటూ బీజేపీ నేతలు విమర్శలకు దిగగా.. తృణమూల్‌ నాయకులు అందుకు ధీటుగా బదులిచ్చారు.(మమత సర్కార్‌పై కేంద్రం ఆగ్రహం)

ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ఓ బృందాన్ని అక్కడికి పంపగా. కరోనా పరీక్షలు, పర్యవేక్షణ, కేసుల ట్రాకింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సరిగా లేదని.. అక్కడ మరణాల రేటు ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక తాజాగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరుణంలో బంగ్లాదేశ్‌ నుంచి సరుకు రవాణకు కేంద్రం అనుమతినివ్వగా.. ఆ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. తమ రాష్ట్రం నుంచి వాహనాలను పోనిచ్చేది లేదంటూ సీఎం మమత స్పష్టం చేయగా.. ఆమె నిర్ణయాన్ని తప్పుపడుతూ కేంద్రం ఘాటు లేఖ రాసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top