ఉగ్ర దాడులు, సరిహద్దు రక్షణలో అమరులైన సైనికులకు పార్లమెంటు మంగళవారం ఘన నివాళులర్పించింది.
న్యూఢిల్లీ: ఉగ్ర దాడులు, సరిహద్దు రక్షణలో అమరులైన సైనికులకు పార్లమెంటు మంగళవారం ఘన నివాళులర్పించింది. పఠాన్‌కోట్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన ఏడుగురు భద్రతా సిబ్బందితోపాటు సియాచిన్‌లో మంచుచరియల కింద చిక్కుకొని కన్నుమూసిన ఎనిమిది మంది జవాన్లు, లడఖ్‌లో మంచుచరియలకు బలైన నలుగురు జవాన్లకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నివాళులర్పించారు. ఉగ్రవాదుల మతిలేని హింస తీవ్రంగా ఖండించదగ్గదన్నారు. మాజీ ఎంపీ, జమ్మూకశ్మీర్ దివంగత సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్, లోక్‌సభ మాజీ స్పీకర్, మాజీ గవర్నర్ బలరాం ఝాఖడ్, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ తదితరుల మృతికి అన్సారీ సంతాపం తెలిపారు. అమర జవాన్ల గౌరవార్థం రాజ్యసభ కాసేపు మౌనం పాటించింది. లోక్‌సభ కూడా అమర జవాన్లకు నివాళులర్పించింది.
జేఎన్‌యూపై నేడు రాజ్యసభలో చర్చ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బుధవారం న రాజ్యసభలో జేఎన్‌యూ వివాదంపై చర్చతో అధికార, విపక్షాలు తలపడనున్నాయి. మంగళవారం నాటి సభా కార్యక్రమాల సలహా సంఘం భేటీలో.. అధికార, విపక్ష సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు బుధవారం జేఎన్‌యూ అంశంపై చర్చించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జేఎన్‌యూ అంశంతో పాటు.. ఇష్రాత్ జహాన్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలంపైనా చర్చ జరపాలంటూ బీజేపీ ఎంపీ భూపీందర్‌యాదవ్ నోటీస్ ఇచ్చారు. భావప్రకటన స్వేచ్ఛపై చర్చకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.