పిట్టకొంచెం కూత ఘనం!  | Sakshi
Sakshi News home page

పిట్టకొంచెం కూత ఘనం! 

Published Sat, Jun 22 2019 2:08 PM

7 Years Old Stands Outside Parliament to Urge PM and MPs to Pass Climate Change Law - Sakshi

న్యూఢిల్లీ : పట్టుమని పదేళ్ళు కూడా లేని ఓ చిన్నారి పర్యావరణాన్ని కాపాడేందుకు నడుంబిగించి అందరిని ఆకట్టుకుంది. భావితరాల భవిష్యత్తుని అంధకారంగా మారుస్తోన్న కాలుష్యాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణ బాధ్యతని ప్రతి ఒక్కరు భుజాలకెత్తుకోవాలని మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కంగుజామ్‌ అనే ఏడేళ్ల చిన్నారి పోరాడుతుంది. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణలో ప్లకార్డు పట్టుకోని పర్యావరణాన్ని రక్షించాలని పార్లమెంట్‌ సభ్యులను విజ్ఞప్తి చేసింది. ఆ ప్లకార్డుపై ‘డియర్‌ మిస్టర్‌ మోదీ, పార్లమెంట్‌ సభ్యులు దయచేసి ‘ వాతావరణ మార్పు చట్టాన్ని’ తీసుకురండి. మన భవిష్యత్తు తరాలను కాపాడండి’ అని తన గళాన్ని వినిపించింది. 

రెండో తరగతి చదువుతున్న ఈ చిన్నారి పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ సముద్రాల విస్తీర్ణం పెరిగిపోతుంది. మరోవైపు భూమి వేడెక్కుతోంది. ప్రధాని వెంటనే ఈ పరిస్థితులను సీరియస్‌గా తీసుకుని వాతావరణ చట్టంలో మార్పులు తీసుకురావాలి.’ అని కోరింది. ఇంటర్నేషనల్‌ యూత్‌ కమిటీలో విప్తత్తు ప్రమాదాల తగ్గింపు అడ్వోకేట్‌గా నియమితులై చరిత్ర సృష్టించింది. అలాగే విప్తత్తు ప్రమాదాల తగ్గింపుపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సమావేశం నుంచి ఆహ్వానం అందుకున్న చిన్నారిగా గుర్తింపు పొందింది. కేవలం భారత్‌ తరపునే కాకుండా మొత్తం ఆసియా, పసిఫిక్‌ ఖండాల నుంచి ఈ సమావేశానికి హాజరైన చిన్నారిగా రికార్డు నమోదుచేసింది. ఆ సమావేశం సందర్భంగా లిసిప్రియా మాట్లాడుతూ.. సునామీ, వరదలు, భూకంపాలతో ప్రజలు ఇబ్బంది పడటాన్ని టీవీలో చూసి నాకు చాలా భయమేసేది. ఈ బీభత్సాలకు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను, గూడు చెదిరిపోయిన వారిని చూస్తే ఏడుపు వచ్చేది. నేనందరిని కోరేది ఒక్కటే..  ఓ గొప్ప ప్రపంచాన్ని సృష్టించడం కోసం అందరం నడుం బిగిద్దాం.’ అని విజ్ఞప్తి చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.

ఇక రోజు రోజుకు వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని. మానువుల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య మరింత ఉధృతం కాకముందే స్పందించి తగిన చర్యలు సత్వరమే చేపట్టకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement