నోటాతో మనసులు గెలవాలి

Vijay Devarakonda Pressmeet In Tamil Nadu - Sakshi

సినిమా: నోటా చిత్రం విడుదల కోసం ‘మరణ వెయిటింగ్‌’(ఆతృతగా ఎదురుచూడటం)లో ఉన్నానని ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌దేవరకొండ వ్యాఖ్యానించారు. తెలుగులో పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో అనూహ్య క్రేజ్‌ సంపాదించుకున్న ఈయన తమిళంలో హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ఇది. స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న (తమిళం, తెలుగు)ద్విభాషా చిత్రం నోటా. సంజనా నటరాజన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, నాజర్, ఎంఎస్‌.భాస్కర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అరిమానంబి, ఇరుముగన్‌ చిత్రాల ఫేమ్‌ ఆనంద్‌శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయకి సంజనా నటరాజన్‌ మాట్లాడుతూ ఒక లఘు చిత్రంలో నటించి ఆ తరువాత వెబ్‌ సీరీస్‌లో నటిస్తున్న తనను కనుగొని ఈ చిత్రం ద్వారా కథానాయకిగా అవకాశం కల్పించిన దర్శకుడు ఆనంద్‌శంకర్‌కు, నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు ఆనంద్‌శంకర్‌ మాట్లాడుతూ చిత్ర స్క్రిప్ట్‌ సిద్ధం అయిన తరువాత ఇందులో హీరో ఎవరన్న ప్రశ్న ఎదురైందన్నారు. కారణం ఇందులో హీరోతో పాటు ఇతర నటీనటులకు నటనకు అవకాశం ఉంటుందన్నారు. ఆ సమయంలో తెలుగులో పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి అంటూ వెరైటీ చిత్రాలతో విజయవంతమైన చిత్రాలతో నమ్మకమైన హీరోగా విజయ్‌ దేవరకొండ ఎదుగుతున్నారన్నారు.

విజయ్‌దేవరకొండను నోటా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తే బాగుంటుందని భావించానన్నారు. అందుకు నిర్మాత జ్ఞానవేల్‌రాజా పచ్చజెండా ఊపడంతో విజయ్‌దేవరకొండను కలిసి కథ చెప్పానన్నారు. అలా ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లిందని తెలిపారు. చిత్ర కథానాయకుడు విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ ఈ చిత్ర తొలి పాత్రికేయుల సమావేశంలో ఎణ్ణిత్తుణిక్కరుమమ్‌ అనే తిరుక్కురల్‌ వ్యాఖ్యలను బట్టి పడుతూ కూర్చున్నానని అన్నారు. అయితే ఇప్పుడు తిరుక్కురల్‌ను అప్పజెప్పేస్థాయికి వచ్చానన్నారు. ఈ చిత్రం గురించి ట్విట్టర్లలో తరచూ మరణ వెయిటింగ్‌ అని పోస్ట్‌ చేశారని, అదే విధంగా ఈ చిత్ర విడుదల కోసం తానూ మరణ వెయిటింగ్‌లో ఉన్నానని పేర్కొన్నారు. నోటా చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల మనసులను గెలవాలని ఆశ పడుతున్నానని అన్నారు. విజయ్‌దేవరకొండ తిరుక్కురల్‌లోని ఒక వచనాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top