ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

Varun Tej Talks About Valmiki Movie - Sakshi

ఓసారి చిరంజీవిగారి బయోపిక్‌ తీయాలనే ఆలోచన ఉందని హరీశ్‌గారు అన్నారు. అయితే నాతో తీస్తాననలేదు. చరణ్‌ అన్న చేస్తేనే బాగుంటుంది. చరణ్‌ అన్న చేయకపోతే నేను ట్రై చేస్తా. హైట్‌ని సీజీలో కవర్‌ చేస్తా (నవ్వుతూ). అయితే బయోపిక్‌ గురించి హరీశ్‌ సీరియస్‌గా అన్నారా? లేదా అనే విషయాన్ని చెప్పలేను. చిరంజీవిగారిని తను లవ్‌ చేసినంతగా వేరే ఎవరూ చేయలేరని హరీశ్‌ ఉద్దేశం.

‘‘ఆర్టిస్టుకు హద్దులు ఉండకూడదని నమ్ము తాను. ఏ పాత్రైనా చేయగలగాలి. రేపు నేను ఏదైనా డిఫరెంట్‌ పాత్ర చేసినప్పుడు వరుణ్‌ ఏంటీ ఇలా అని ఆడియన్స్‌ షాక్‌ అవ్వకూడదు. ఒక బౌండరీలోనే ఉండాలనుకోవడంలేదు’’ అన్నారు వరుణ్‌ తేజ్‌. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్, అథర్వ, పూజా హెగ్డే, మృణాళిని ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది రీమేక్‌. 14రీల్స్‌ ప్లస్‌పై గోపీ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్‌ కానున్న సందర్భంగా వరుణ్‌ చెప్పిన విశేషాలు.

  • ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) చిత్రాల తర్వాత చాలా ప్రేమకథలు విన్నాను. ఆ సమయంలో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ‘దాగుడు మూతలు’ కథ చెప్పారు. ‘ప్రస్తుతం నేను ప్రేమ కథ చేయాలనుకోవడం లేదు. మీ సై్టల్‌ ఆఫ్‌ మూవీ ఏదైనా ఉందా?’ అని అడిగాను. అప్పుడు తమిళ మూవీ ‘జిగర్తాండ’ చూశావా? అని అడిగారు. చూశానంటే మళ్లీ చూడమన్నారు. అలా ‘వాల్మీకి’ మొదలైంది.
  • హీరో మంచివాడిగానే ఎందుకు ఉండాలి? ఓ బ్యాడ్‌బాయ్‌గా ఎందుకు ఉండకూడదు? అని నేను ఆలోచిస్తున్న సమయంలో హరీశ్‌ వాల్మీకి కథ చెప్పారు. ఈ సినిమా చేస్తున్నాను అనగానే చాలా మంది ‘ఇప్పుడు విలన్‌గా ఎందుకు?’ అన్నారు. దాంతో ఈ స్క్రిప్ట్‌ను చిరంజీవిగారి దగ్గరకు తీసుకువెళ్లాను. ఆయన హీరోనా? విలనా? అని అడగలేదు. కథ బాగుంది. సినిమా చెయ్యి అన్నారు. హరీశ్‌ని పిలిచి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. వాటిని మేం పాటించాం.
  • ఈ సినిమాలో నేను గద్దలకొండ గణేశ్‌ పాత్ర చేశాను. ‘పునాదిరాళ్లు’ సినిమాలో చిరంజీవిగారిది ఓ స్టిల్‌ ఉంటుంది. ఆ స్టిల్‌ను రిఫరెన్స్‌గా తీసుకుని గణేశ్‌ లుక్‌ని రెడీ చేసుకున్నాం. ఆ స్టిల్‌ను చిరంజీవిగారికి కూడా పంపాం. మంచిగా ఉండే గణేశ్‌ ఎందుకు క్రూరంగా మారాడు? అనే అంశాలను చెప్పడానికి ఓ బ్యాక్‌స్టోరీ యాడ్‌ చేశాం. ఈ పార్ట్‌లోనే పూజా హెగ్డే వస్తారు. ఈ బ్యాక్‌స్టోరీ ‘జిగర్తాండ’లో లేదు. ఇంకొన్ని మార్పులు కూడా చేశాం. ‘ఎఫ్‌ 2’లో నేను డీసెంట్‌ తెలంగాణ యాస పలికాను. కానీ ‘వాల్మీకి’లో నేను చెప్పిన తెలంగాణ యాస డైలాగ్స్‌ మాసీగా ఉంటాయి. 
  • గణేశ్‌ పాత్రను బాగా ఎంజాయ్‌ చేశాను. హరీశ్‌గారు మంచి డైలాగ్స్‌ రాశారు. పూజా హెగ్డేతో నాలుగేళ్ల తర్వాత కలిసి నటించాను. పూజా పాత్ర కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తనది ముఖ్యమైన పాత్ర. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ తొలి సినిమాలో హీరోగా నటించడం హ్యాపీ. ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌.
  • పని విషయంలో హారీశ్‌ మాత్రమే కాదు.. నేను కూడా చాలా ఫాస్ట్‌. మాట్లాడటమే కాస్త నెమ్మదిగా మాట్లాడతాను. పనిలో స్పీడ్‌ ఉంటుంది. డైరెక్టర్‌కు స్పీడ్‌ ఉన్నప్పుడు మనం కూడా స్పీడ్‌గా వెళ్లాలనిపిస్తుంది. హారీశ్‌గారిలో మంచి ఎనర్జీ ఉంది. 
  • ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్‌ రీమిక్స్‌ రెస్పాన్స్‌ విషయంలో నేను కాస్త టెన్షన్‌ పడ్డాను. కానీ చేసేప్పుడు పెద్దగా టెన్షన్‌ పడలేదు. మిక్కీ జె. మేయర్, హరీశ్, మా కాస్ట్యూమ్‌ టీమ్‌ జాగ్రత్తలు తీసుకుని నా టెన్షన్‌ను తగ్గించారు. నేను జస్ట్‌ డ్యాన్స్‌ చేశాను. పాటను విడుదల చేసిన తర్వాత వస్తోన్న స్పందనకు ఫుల్‌ హ్యాపీ.
  • ‘జిగర్తాండ’ కల్ట్‌ మూవీ. ఈ సినిమాలో నటనకుగాను బాబీ సింహాకు జాతీయ అవార్డు వచ్చింది. రీమేక్‌లో తన పాత్రని నేను చేశాను. కానీ నా సై్టల్‌లో గద్దలకొండ గణేశ్‌ పాత్ర చేశా. ఆల్రెడీ తమిళ సినిమా ‘జిగర్తాండ’ చూసిన వారికి మా ‘వాల్మీకి’ నచ్చుతుందా? లేదా అని చెప్పలేను. కానీ మంచి ఎంటర్‌టైనర్‌. ఒక సినిమాను ఎక్కువమందికి చేరువ కావాలనే రీమేక్‌ చేస్తాం. అలానే ‘వాల్మీకి’ సినిమా చేశాం.
  • కొన్ని సినిమాలకు బడ్జెట్‌ కావాలి. బడ్జెట్‌ పరిమితుల వల్ల ‘అంతరిక్షం’ సినిమా విషయంలో కొన్ని అంశాలకు సంబంధించి రాజీ పడాల్సి వచ్చింది. అనుకున్నది రీచ్‌ కాలేకపోతున్నామా? అనే సందేహం షూటింగ్‌ సమయంలోనే వచ్చింది. ఆ సినిమాలో నేను వేసుకున్న స్పేస్‌ సూట్‌ని నా ఆఫీస్‌ ఎంట్రన్స్‌లో పెట్టుకున్నా. నా తప్పులను తెలుసుకోవడానికి. నెక్ట్స్‌ టైమ్‌ ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ సూట్‌ను  చూసుకుని ఓసారి లొపలికి వెళ్తాను (నవ్వుతూ). కానీ ‘అంతరిక్షం’లాంటి ప్రయోగాత్మక సినిమాలను ప్రయత్నించడం ఆపను. ఒక సక్సెస్‌ వచ్చి నా మార్కెట్‌ పెరిగిందంటే డబ్బులు గరించి ఆలోచించను. మార్కెట్‌ పెరిగితే ఏదైనా కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటాను. కాస్త రిలాక్డ్స్‌గా సినిమాలు చేయడానికి కావాల్సిన సమయం, వయసు నాకు ఉన్నాయి.
  • నా తొలి సినిమా ‘ముకుంద’ అప్పుడుసెట్‌లో చాలామంది ఉన్నారని సిగ్గుతో కెమెరా ముందుకు రావడానికి ఇబ్బందిపడేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా కాదు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. 
  • ‘సైరా’ ట్రైలర్‌ని రిలీజ్‌కి ముందు చూడలేదు. మంగళవారం రాత్రి చరణ్‌ అన్నను కలిసినప్పుడు చూద్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను. బుధవారం చూశాను. చిరంజీవిగారు ఏ సినిమా చేసినా చూస్తా. నా సినిమా ఉన్నా.. నేను చిరంజీవిగారి సినిమాకే వెళ్తాను. 
  • ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి సినిమాలో బాక్సర్‌గా నటిస్తున్నాను. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో నేను చేయాల్సిన సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. చేస్తామా? చేయమా? అని ఇప్పుడే చెప్పలేను. వెంకటేశ్‌గారిని రెగ్యులర్‌గా కలుస్తుంటా. ‘ఎఫ్‌ 3’ ఉండొచ్చు.
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top