నెగటివ్‌గా రాయకండి ప్లీజ్

నెగటివ్‌గా రాయకండి ప్లీజ్


దయచేసి చిత్రాల గురించి నెగిటివ్‌గా రాయకండి అంటూ సీనియర్ నటుడు, నడిగర్ తిలకం శివాజీగణేశన్ వారసుడు ప్రభు మీడియాకు విజ్ఞప్తి చేశారు. బుధవారం పత్రికల వారితో ముచ్చటించిన ఆయన ప్రస్తుతం చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలియనివి కాదని, సినిమాను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడమే కష్టం అయిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా విమర్శలు రాసేటప్పుడు నెగిటివ్‌గా రాయరాదని విన్నవించారు.

 

  విమర్శలు చేయండి తప్పొప్పులను రాయండి కానీ చిత్రం చెత్తగా ఉంది లాంటి పదాలు చేర్చడం వల్ల ప్రేక్షకులు థియేటర్ల వైపే రావడం లేదన్నారు. ఈ తరం నటీనటులు, సాంకేతికవర్గం మంచి చిత్రాలు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. పత్రికల వారితో తనకున్న అనుబంధంతో ఈ సూచన చేస్తున్నానని పేర్కొన్నారు. ఇక తాను ప్రస్తుతం నటించడం తగ్గించుకున్నానని, మంచి పాత్రలు అనిపిస్తే చేయడానికి అంగీకరిస్తున్నానని తెలిపారు.

 

  ప్రస్తుతం తన అన్నయ్య కొడుకు దుశ్యంత్ రామ్‌కుమార్ నిర్మాతగా మారి ఈశన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న మీన్‌కొళంబుం మణ్ పానైయం చిత్రంలో మాత్రమే నటిస్తున్నానని, ఇందులో నటుడు కమలహాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. తన కొడుకు విక్రమ్ ప్రభు నటించిన వీరశివాజీ నవంబర్ తొలివారంలో విడుదల కానుందని తెలిపారు. తదుపరి సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ముడిచూడ మన్నన్ చిత్రంతో పాటు, తను నిర్మాతగా మారి ఫస్ట్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న నెరుప్పుడా చిత్రంలోనూ నటిస్తున్నారని తెలిపారు.ఈ సమావేశంలో నటుడు విక్రమ్‌ప్రభు, రామ్‌కుమార్ పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top