తమిళనాడులో ఉన్న అమెరికా రాయబారి కార్యాలయంతో పాటు సినీ నటుడు ప్రభు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈమేరకు డీజీపీ కార్యాలయానికి ఒక ఈ–మెయిల్ వచ్చింది. అందులో అన్నా ఫ్లైఓవర్ సమీపంలోని అమెరికా డిప్యూటీ కాన్సులేట్‌లో మరికాసేపట్లో బాంబు పేలుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత నటుడు ప్రభు ఇంట్లో ఒక బాంబు పేలుతుందని మెయిల్ ద్వారా హెచ్చరించారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలు సహాయంతో అన్నిచోట్లా తనిఖీ చేశారు.
తర్వాత అమెరికా కాన్సులేట్‌లో పనిచేస్తున్న అధికారుల ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి బాంబులు దొరకలేదు. ఇది కేవలం కావాలనే కొందరు ఆకతాయిలు చేసిన పని అని తేలింది. అదేవిధంగా నటుడు ఎస్.వి.శేఖర్ ఇల్లు, మైలాపూర్‌లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఇళ్లలో బాంబులు పెట్టినట్లు తెలిపారు. వెంటనే తనిఖీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


