'పాత్రల్లో పరకాయప్రవేశం నా స్టైల్‌'

Sakshi Interview With Sai-Madhav- Burra

సాయి మాదవ్‌ బుర్రా

సాక్షి, తెనాలి(గుంటూరు) : సాయిమాధవ్‌ బుర్రా.. తెలుగు సినిమాకు ఆయనో స్టార్‌ రైటర్‌. ప్రతిష్టాత్మక చిత్రాలకు అవకాశాలు ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి. బాక్సాఫీసు హిట్లవ్వటమే కాదు.. అందులోని సంభాషణలు ప్రజల నోళ్లలో వర్ధిల్లుతున్నాయి. సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌తో సహా పలు సినిమాలతో బిజీ గా ఉన్న సాయిమాధవ్, స్వస్థలమై న తెనాలికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..   కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు.తెలుగు సినిమా రంగం ఇప్పుడు చాలా బాగుంది. ఇటీవల రిలీజైన్‌ చిన్న సినిమాలు ‘బ్రోచేవారెవరురా’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ పెద్ద హిట్లు.

రెగ్యులర్‌ సినిమాలను జనం చూడటం లేదు. ఏదొక కాన్సెప్ట్‌ ఉండాలి.  మేకర్స్‌ కంటే ఆడియన్స్‌ హైలెవెల్‌లో ఉంటున్నారు.  ప్రతిష్టాత్మక బ్యానర్లు తీస్తున్న వైవిధ్యమైన సినిమాలకు సంభాషణలు రాసే అవకాశాలు వస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కువగానే కష్టపడుతున్నాను. ఏ సినిమాకు సంభాషణలు రాసేటప్పుడు, అందులోని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాను. నా అభిప్రాయాలు ఆ పాత్రపై రుద్దను. సంభాషణలు రాసేందుకు కలం పట్టుకున్నప్పుడు నేనెప్పుడూ ఆ పాత్రలానే ఆలోచిస్తుంటాను. అందుకే అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి.  

హాలీవుడ్‌ స్థాయిలో ‘సైరా ఉయ్యాలవాడ’.. 
ప్రస్తుతం చిరంజీవి ‘సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పూర్తయింది. తెనాలి వచ్చేముందే పూర్తి సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఉయ్యాలవాడ చరిత్రను తెరకెక్కించటమే పెద్ద సాహసం. అద్భుతమైన కథ. తెలుగు సినిమా స్థాయిని హైట్స్‌కు తీసుకెళ్తుందని నమ్ముతున్నా. హాలీవుడ్‌ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. చిరంజీవి నటవిశ్వరూపం ఇందులో  చూడొచ్చు. 

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ..  
చరిత్ర అనగానే విమర్శలుంటాయి. క్రిష్, నేను కలసి గౌతమీపుత్ర శాతకర్ణి చేద్దామనుకున్నప్పుడు ఆయనకు చరిత్ర రెండు లైన్లకన్నా లేదన్నారు. దర్శకుడు క్రిష్‌ పరిశోధించి, తీసిన చిత్రం ఎంత హిట్టయిందో తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విషయంలోనూ అంతే. ఆయన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు అనేందుకు మనదగ్గర బోలెడన్ని ఆధారాలున్నాయి. దర్శకుడు సురేంద్రరెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, భూపతిరాజా, సత్యానంద్‌ అందరూ ఉయ్యాలవాడ స్వస్థలానికి వెళ్లి, కష్టపడి కలసి కథ సిద్ధంచేశారు. నేను సంభాషణలు సమకూర్చా. 

వాస్తవ పాత్రలతో అల్లిన కల్పిత కథ ఆర్‌ఆర్‌ఆర్‌
రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాదీ చారిత్రక నేపథ్యమే. వాస్తవ పాత్రలతో అల్లిన కల్పితగాథ అనుకోవచ్చు. వాస్తవానికి బాహుబలికి నేనే రాయాల్సింది. మిస్సయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ అవకాశం ఇచ్చారు. రాజమౌళి కథ విన్నప్పుడే షాకయ్యాను.. ఇలా కూడా ఆలోచించవచ్చా అని..! సైరా గానీ, ఆర్‌ఆర్‌ఆర్‌ గానీ తెలుగు సినిమాకు నెక్టŠస్‌ లెవెల్‌కు తీసుకెళ్తాయి. రాజుగారి గది–3 నేను రాస్తున్న మరో సినిమా. రాజమౌళి సహాయకుడు అశ్విని దర్శకత్వంలో ‘ఆకాశవాణి’ అనే సినిమాకు చేశాను. టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్‌ స్క్రిప్టు సిద్ధమైంది. ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతోంది. త్వరలో షూటింగ్‌ అనౌన్స్‌ చేస్తారు. రేణుదేశాయ్‌ను ఒక క్యారెక్టర్‌కు అనుకున్నారు. త్వరలో తెలుస్తుంది. విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాలకు రాయటం అదృష్టంగా భావిస్తున్నా.      

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top